పాలు కాదు ప్రాణంతక విషం! అప్రమత్తంగా లేకపోతే అంతే!

సిటీ లైఫ్ అంటేనే పరుగుల జీవనం.. మరి ఈ పరుగులో మనం ఆరోగ్యాన్ని వెనక్కి నెట్టేస్తున్నామా? పల్లెటూర్లలో వేకువజామునే ఆవు లేదా గేదె పాలు స్వచ్ఛంగా దొరుకుతాయి. కానీ, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో పరిస్థితి భిన్నం. ఇక్కడ చాలామందికి ప్యాకెట్ పాలే శరణ్యం. ఒకవేళ నేరుగా డైరీ ఫామ్స్ లేదా స్థానికంగా ఉండే ఇళ్ల మధ్య విక్రయించే పాలు తెచ్చుకుంటున్నాము కదా అని సంబరపడితే.. అక్కడ కూడా ‘కల్తీ’ రక్కసి పొంచి ఉంటోంది.నేడు మార్కెట్లో కల్తీ లేని పదార్థం దొరకడమే అరుదైపోయింది. నిత్యావసరాల నుంచి మనం ప్రాణప్రదంగా భావించే పాల వరకు ప్రతిదీ కలుషితమవుతోంది. గోదావరి తీరాన ఉన్న రాజమండ్రిలో వెలుగుచూసిన కల్తీ పాల ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పవిత్ర క్షేత్రంగా పేరొందిన సిటీలో జరిగిన ఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం కల్తీ పాలు సేవించిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరో పన్నెండు మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. బాధితులు ప్రత్యేక వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకుంటూ నివేదికల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మరణించడం బాధాకరం. ఇప్పటికీ కొందరు వెంటిలేటర్‌పై ఉండగా, మరో ఎనిమిది మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి డయాలసిస్‌, కిడ్నీల ఫెయిల్యూర్‌ వరకు వెళ్లడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు అలముకున్నాయి. అనారోగ్యం పాలైన వారు వృద్ధులు, చిన్నారులే కావడం పెద్ద విషాదం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కారణాలను అన్వేషించే పనిలో పడింది. కోరుకొండ మండలం పర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డెయిరీ నుంచి సరఫరా అయిన కల్తీ పాలే పలువురి అస్వస్థతకు హేతువని ప్రాథమికంగా గుర్తించారు. డెయిరీ నిర్వాహకుడిపై ఐదు హత్యాయత్నం కేసులు పెట్టారు. కల్తీ పాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతోపాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామంటోంది. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తామని ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ప్రకటనలు చేశారు.   మన రోజువారీ జీవితంలో పాలు కీలక భాగం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ పాలు అవసరం. ఉదయం కాఫీ, టీ, పిల్లల ఆహారం అన్నీ పాలపై ఆధారపడే పరిస్థితి. అలాంటి ఆహారాన్ని లాభం కోసం విషంగా మార్చడం అమానుష చర్యగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మిన పాలు ప్రాణాపాయానికి దారితీస్తే అది మరింత భయానక పరిస్థితి. ఈ ఘటన నేపథ్యంలో పాల నాణ్యతపై కఠిన తనిఖీలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్యం కంటే లాభం ముఖ్యం కాదని గుర్తించి ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానం వచ్చినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చు.ఈ నేపథ్యంలో తెల్లనివన్నీ పాలుకావని.. వాటిలో సైతం కల్తీ ఉంటుందనే విషయం ప్రజలకు క్లియర్ కట్‌గా అర్థమైంది. నిపుణుల ప్రకారం పాలను చిక్కగా కనిపించేలా చేయడానికి లేదా ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు కొన్ని ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. యూరియా, డిటర్జెంట్లు, లిక్విడ్ సోప్ వంటి పదార్థాలు కలిపితే పాలు నురగతో కనిపిస్తాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు ముఖ్యంగా కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఘటనలో బాధితులకు ముందుగా అస్వస్థత, మూత్ర సమస్యలు తలెత్తి, తర్వాత పరిస్థితి విషమించిందని అధికారులు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులు పాలు చెడిపోకుండా ఉండేందుకు ఫార్మాలిన్ వంటి రసాయనాలు కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది సాధారణంగా శవాలను కుళ్లిపోకుండా ఉంచేందుకు ఉపయోగించే పదార్థం. శరీరంలోకి వెళ్లితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా సింథటిక్ మిల్క్ తయారుచేసి విక్రయిస్తున్న ఘటనలు గతంలో కూడా వెలుగుచూశాయి. ఇలాంటి కల్తీని కొన్ని సరళమైన పద్ధతులతో ఇంట్లోనే గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏట‌వాలుగా ఉన్న చోట ఒక చుక్క పాలను వేసినప్పుడు అది నెమ్మదిగా కదులుతూ వెనుక తెల్లటి గీత కనిపిస్తే పాలు స్వచ్ఛమైనవని అర్థం. వేగంగా జారిపోతే అనుమానం కలగాలి. గ్లాసులో పాలు, నీరు కలిపి బాగా కదిపితే ఎక్కువసేపు నురుగు ఉంటే డిటర్జెంట్ కలిసే అవకాశముందని అనుమానించాలి. అలాగే సింథటిక్ పాలు చేతిలో రుద్దితే జిగటగా అనిపిస్తాయి. మీ ఇంటికే వచ్చి పాలను ఇచ్చినప్పటికీ వాటిల్లోని కల్తీ జరిగే ప్రమాదం లేకపోలేదని ఆహార భద్రత అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వివిధ హానికారక రసాయనాలతో కల్తీ పాలను తయారు చేయడమే కాకుండా వాటిని నిజమైన వాటిలా చూపించడానికి పాల పౌడర్లలో యూరియా నుంచి రకరకాల పద్ధతులు పాలో అవుతున్నారు. కృత్రిమంగా తయారు చేసిన పాలు అనే సందేహం రాకుండా ఉండటానికి, అవే స్వచ్ఛమైన పాలు అని నమ్మించడానికి నురుగు వచ్చేలా కూడా చేస్తారు కూడా. పాల కల్తీ విషయంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యవర్తులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పాలను ఇంటింటికీ సరఫరా చేస్తారు. అలాంటి సందర్భాల్లో పాల నిల్వ కేంద్రాల్లో పలు రకమైన మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. నగరాల్లో ప్రజలు ఎక్కువగా బ్రాండెండ్ కంపెనీల పాల ప్యాకెట్లే వాడతారు. అలాంటి చోట్ల కూడా మోసాలకు ఆస్కారం ఉందని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. కల్తీ పాల వ్యవహారంతో ప్రజలను అప్రమత్తత చేయాల్సి అవసరం ఆహార భద్రత విభాగం పై ఉంది. కల్తీ పాలు ఎలా తెల్సుకోవచ్చంటే…. కొంతమంది పాలలో నీళ్లు, యూరియా కలిపి మిల్క్ క్వాంటిటీని పెంచుతారు. దీనివల్ల కల్తీ పాలు చిక్కగా, తెల్లగా కనిపిస్తాయి, అసలు కల్తీ జరిగిందనే విషయమే తెలియదు. ఒకవేళ ఈ పాలు, పెరుగు టేస్ట్ తేడాగా అనిపిస్తే.. ఒక టెస్ట్ చేయాల్సిందే. అర టీస్పూన్ పాలలో అర టీస్పూన్ సోయాబీన్ పౌడర్ లేదా కందిపప్పు పొడి వేసి బాగా కలపాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో ఒక రెడ్ కలర్ లిట్మస్ పేపర్ ముంచాలి. ఆ లిట్మస్ పేపర్ బ్లూ కలర్‌లోకి మారితే, ఆ పాలలో యూరియా ఉన్నట్లు అర్థం. మరొక మార్గం. చిక్కగా ఉన్న పాలలో కాసిన్ని నీళ్లు కలిపితే ఎవరూ గుర్తు పట్టలేరు. కానీ కొంతమంది విడి పాలలో ఎక్కువ నీళ్లు కలిపి అమ్ముతున్నారు. దీనివల్ల మిల్క్‌లోని పోషకాలు తగ్గిపోవడంతో పాటు అవి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. మీరు కొనే పాలలో నీళ్లు ఎక్కువగా కలిపినట్టు డౌట్ ఉంటే.. ఇంట్లోనే వాటర్ టెస్ట్ చేసుకోవచ్చు. ఒక శుభ్రమైన స్టీల్ ప్లేట్‌ను వాలుగా ఉంచి, దానిపై ఒక చుక్క పాలు వేయండి. స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా కదులుతాయి. అది ఒక వైట్ కలర్ లైన్‌లా కనిపిస్తుంది. నీళ్లు కలిపిన పాలు వేగంగా కిందకు జారిపోతాయి. పాల కల్తీకి కల్తీరాయుళ్లు వాడేది డిటర్జెంట్. . కొంతమంది పాలలో డిటర్జెంట్ కలుపుతుంటారు. దీంతో పాలు నురగ వచ్చి చిక్కగా కనిపిస్తాయి. ఇవి తాగితే స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. ఈ కల్తీని కూడా ఈజీగా కనిపెట్టవచ్చు. ఒక చిన్న బాటిల్‌లో 5-10 మి.లీ పాలు, అంతే మొత్తం వాటర్ పోసి బాగా షేక్ చేయండి. స్వచ్ఛమైన పాలలో కొద్దిగా నరగ వచ్చి వెంటనే పోతుంది. ఒకవేళ ఆ పాలలో ఎక్కువ నురగ వచ్చి, అది చాలాసేపు అలాగే ఉంటే, అందులో డిటర్జెంట్ కలిపినట్లు అర్థం. పాలు చిక్కగా కనిపించడానికి కొంతమంది బియ్యం పిండి కలుపుతుంటారు. ఇవి తాగితే డైజేషన్ సిస్టమ్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ కల్తీని ఈజీగా కనిపెట్టవచ్చు. ఒక చిన్న టీ గ్లాస్‌లో పాలు వేడి చేసి అందులో రెండు మూడు చుక్కల అయోడిన్ టించర్ వేయండి. పాలు బ్లూ కలర్‌లోకి మారితే, అందులో పిండి పదార్థాలు కలిపినట్లు అర్థం. స్వచ్ఛమైన పాలు రంగు మారవు ఇలా పాల కల్తీని మనం కనుక్కోవచ్చు. ఇవే కాదండోయ్.. మనం ఇంట్లో టెస్టు చేసినా తెలియని విధంగా కూడా పాలల్లో కల్తీ జరుగుతుంది. పాలు విరిగిపోకుండా ఉండేందుకు సోడా, చెడిపోకుండా ఉండటానికి చక్కెర, ఉప్పు కలుపుతారు. పాలు చిక్కగా ఉండేందుకు పాల పొడి వినియోగిస్తారు. ఇవే కాకుండా గ్లూకోజ్, గంజిపౌడర్, యూరియా, సోడియం కార్బోనేట్‌ తదితర వాటిని కలిపి కల్తీ పాలను విక్రయిస్తున్నారు. గేదె నుంచి వచ్చే రెండు లీటర్ల పాలలో నెయ్యి, యూరియా, వరి పిండి, పాలపొడి, సోడా వంటి పదార్థాల్ని కలపడం ద్వారా నాలుగు నుంచి ఐదు లీటర్ల కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఇక పాలతో తయారయ్యే స్వీట్లు, పన్నీరు, పెరుగు, నెయ్యి తదితరాలు ఎంతవరకు నాణ్యమైనవి తెలియదు కూడా. ఇవి కాకుండా మరో ప్రమాదం ఉంది. అదే.. ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు. వీటిని బ్యాన్ చేసినా అడ్డ‌దారుల్లో తెచ్చి ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఆవులు, గేదెలకు ఇస్తున్నారు. ఈ ఇంజెక్ష‌న్లు ఇవ్వ‌టం ద్వారా పాల దిగుబడి పెరుగుతుంది. ఈ రకమైన పాలను తాగడం పిల్లలకు ప్రమాదమే.. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.. పెద్దవాళ్లల్లో మోకాళ్ల నొప్పులు ఏర్పడుతాయి. మహిళలు ప్రసవ సమయంలో ఇబ్బందులు పడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం మనుషులకే కాదు.. ఈ ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లతో పశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గి నీరసంగా మారుతాయి. తిరిగి గర్భం దాల్చే పరిస్థితి ఉండదు. త్వరగా చనిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి గోదావరి తీరాన జరిగిన కల్తీ పాల ప్రభావం చిరు పాల వ్యాపారులపై తీవ్రంగా పడింది. పాల వ్యాపారుల నుంచి పాలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీంతో పాలప్యాకెట్లపై ఆధారపడుతున్నారు. కల్తీపాలు ఘటన వెలుగు చూసిన రాజమహేంద్రవరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో లూజు పాల వ్యాపారం సగానికిపైగా పడిపోయింది. కల్తీ పాలు తాగిన పలువురు మృతి చెందారని తెలియటంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. వరుసగా కల్తీ పాల వల్ల మరణాలు సంభవించటంతో ప్రజలు లూజు పాలను కొనుగోలు చేయడం మానేశారు. దీంతో చిరు వ్యాపారులు క్యాన్‌ల ద్వారా పాలను తీసుకొచ్చి అమ్మేవారిపై తీవ్ర ప్రభావం పడింది. డైలీ అమ్మకాలతో పాటూ వీరికి ఆయా ప్రాంతాల్లో ఖాతాదారులు కూడా ఉన్నారు. చిరు వ్యాపారులు పాలను పోస్తూ జీవిస్తుంటారు. పాల వ్యాపారంపైనే ఆధారపడి ప్రతీ రోజు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పాలు సేకరించే వారికి ఈ ఘటన తీవ్ర నష్టం కలిగించింది. ఓ పాల వ్యాపారి అయితే.. 20 ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. రోజుకు 100 లీటర్ల నుంచి 150 లీటర్ల వరకూ పాలు అమ్ముతున్నానని, కొన్ని సమయాంలో 200 లీటర్ల వరకూ కూడా రోజుకు అమ్ముతుంటాని తెలిపాడు. కల్తీ పాలు ఘటన నేపథ్యంలో చాలా మంది కొనుగోలు చేయడం మానేశారని మూడు రోజులుగా రోజుకు 100 లీటర్లు కూడా అమ్ముకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటింటికి తిరిగి పాలు పోసేటప్పుడు అందరూ నమ్మకంగా పాలు తీసుకునేవారని, కల్తీ పాలు ఘటనతో కొంత అనుమానంగా చూస్తున్నారని తెలిపాడు. కల్తీ పాల ఘటన నేపథ్యంలో పాలప్యాకెట్లకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రాజమండ్రిలో కల్తీపాలు ఘటన చోటు చేసుకున్న లాలా చెరువు, చౌడేశ్వరనగర్‌, స్వరూప్‌ నగర్‌ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా పాలప్యాకెట్లనే కొనుగోలు చేస్తున్నారు. ఘటనకు ముందు రోజువారీగా 50 లీటర్ల వరకూ పాలప్యాకెట్లు అమ్మేవారమని, రెండు మూడు రోజులుగా 70 నుంచి 80 లీటర్ల వరకూ పాలప్యాకెట్లు అమ్ముతున్నామని స్వరూప్‌ నగర్‌కు చెందిన ఓ చిరువ్యాపారి అంటున్నాడు. దేశంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు పలు రాష్ట్రాల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా నడుస్తున్నది. గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీ పాల విక్రయాలపై అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు బిహార్‌, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లోనూ కల్తీ పాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలు మాత్రమే 52 శాతం పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. నాబార్డ్ డేటా ప్రకారం.. ఆ రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. పాల ఉత్పత్తిలో రాజస్థాన్ దేశంలోని ముందువరుసలో ఉన్నది. ఇక్కడ పశుపోషణ ఎక్కువగా ఉండడంతో పాల ఉత్పత్తి సైతం ఎక్కువగా జరుగుతున్నది. 2023 సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్‌ డేటా ప్రకారం.. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలలో 15.05శాతం రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది. యూపీలో 14.93 శాతం పాల ఉత్పత్తి జరుగుతున్నది. 8.06 శాతం పాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్‌ నాలుగు స్థానంలో, ఏపీ ఐదో స్థానంలో నిలిచాయి. 2023-24లో యూపీలో 16వేలకుపైగా నమూనాలను పరిశీలించగా నమూనాలు పాజిటివ్‌గా వచ్చాయి. ఆయా నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవు. తమిళనాడులో 2,200పైగా కేసులు నమోదయ్యాయి. ఇక కేరళలో 1,300 కేసులు రికార్డయ్యాయి. పాలు కల్తీ చేసి సంపాదించే కేటుగాళ్లు ఒకవైపు ఉంటే.. మరోవైపు పాలనే నమ్ముకుని.. పాడి పరిశ్రమను బ్రాండ్‌గా చేసుకుని ఎదిగిన వారు ఎందరో మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు మన కళ్ల ముందే..రోజు మనం వాడే ప్రైవేటు కంపెనీలు ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే.. పాల వ్యాపారంలో కోట్ల రూపాయల టర్నోవర్ పాల డెయిరీ కంపెనీలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పాల వ్యాపారం ఏటా 5౦ వేల కోట్ల పైమాటే. ఇక్కడ ఉన్న చిన్నా చితకా పెద్ద డెయిరీలు మొత్తం వాటా 75% పైమాటే. మిగిలిన 25% శాతం స్థానిక పాల వ్యాపారులదే. ఇక్కడ కూడా ఆ మొత్తం చిన్నదేమీ కాదు. ఇంచుమించు పది, పదిహేను వేల కోట్ల వరకు ఆ వ్యాపారం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో పాల వ్యాపారం చాలా పెద్దది. భారతదేశంలో పాలు లేకుండా టీ, కాఫీ తాగరు. విదేశాల్లో దీనికి విభిన్నం. బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ తాగుతారు. భారతీయులు మాత్రమే పాలతో కలిపిన టీని ఆస్వాదించటానికి ఇష్టపడతారు.   గతంలో రైతులు తమకు తాముగా నిర్వహించుకునే సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పాల కల్తీ ఉండేది కాదు. పాడి-పంట.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుతో విడదీయరాని బంధం. గ్రామీణ మహిళలే పాడిని నిర్వహిస్తారు. కానీ కష్టపడి పాలను ఉత్పత్తి చేసిన రైతుకు గిట్టుబాటు ధర దక్కదు. వారి వద్ద నుంచి పాలను సేకరించిన డెయిరీలకు లాభాల పంట పండుతుంది. రోజూ ఉత్పత్తవుతున్న పాలల్లో ప్రైవేటు, సహకారం రెండూ కలిపినా కూడా సంఘటితరంగం కిందికొచ్చేవి సగం కూడా లేదన్నది ప్రభుత్వ అంచనా. డెయిరీల మధ్య అనారోగ్య పోటీ ప్రత్యేకించి.. డెయిరీ ప్రైవేటీకరణ కాస్తా కార్పొరేటీకరణ బాట పట్టిందో.. చిన్నా చితకా డెయిరీలు సైతం లాభాల కోసం తప్పుడు దారులు వెతుకుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్రంలో పాడి పశువుల సంఖ్యపై అనుమానాలున్నాయి. ప్రజల ఆరోగ్యాలను హరించే సింథటిక్‌ పాలు, యూరియా వంటి రసాయనాలతో తయారు చేసిన పాలు మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయన్న ఫిర్యాదులొస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృత్రిమ మేధ పల్లవి ఎత్తుకోగా పాల వ్యాపారులు ఏకంగా కృత్రిమ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. చాలా పుడ్ పరిశ్రమలు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు విక్రయిస్తున్నాయా లేదా అనే ప్రభుత్వ తనిఖీలు అనుమానమే. తనిఖీ బాధ్యతను ఆయా సంస్థలకే వదిలేసినట్లు కనిపిస్తుంది. అదే జరిగితే నాణ్యతకు పాతరేసినట్లే. పాలతో సహా యావత్‌ ఫుడ్‌ సేఫ్టీ బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. లేదంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ——————