తెలంగాణ కాంగ్రెస్ కమిటీశిక్షణా తరగతుల్లో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం నుంచి మొదలుకొని దేశ రక్షణ, డేటా భద్రత వరకు పలు అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.అమెరికాలో సంచలనం సృష్టించిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో తన పేరు బయటకు పొక్కిందన్న భయంతోనే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు పూర్తిగా లొంగిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ బలహీనత కారణంగానే భారత్ ప్రయోజనాలను పణంగా పెట్టి, అమెరికాకు వ్యతిరేకంగా మోదీ ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితిలో ఉన్నారని పార్టీ వర్గాల వద్ద ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ అమెరికాకు అతి సమీపంగా వెళ్లడం వల్లే చైనా మన సరిహద్దుల్లో దురాక్రమణకు తెగబడుతోందని రాహుల్ గాంధీ విశ్లేషించారు.య రాజకీయాల్లో తటస్థంగా ఉండాల్సింది పోయి, మోదీ అమెరికాకు పూర్తిగా లొంగిపోవడం చైనాను రెచ్చగొట్టినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు.పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తున్న తరుణంలో, అమెరికాపై మోదీ అతిగా ఆధారపడటం దేశానికి నష్టదాయకమని హెచ్చరించారు.భారతదేశానికి చెందిన పలు దిగ్గజ కంపెనీలకు అమెరికాతో లోతైన వ్యాపార సంబంధాలు ఉన్నాయని, ఇది దేశ ఆర్థిక స్వతంత్రతపై ప్రభావం చూపుతోందని రాహుల్ పేర్కొన్నారు. మన దేశ డేటాను, ప్రజల సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడికి చేరవేసేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో గత పది రోజులుగా జరుగుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం రాహుల్ గాంధీ రాకతో ఉత్సాహంగా సాగింది. కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఒక ఉపాధ్యాయుడిలా పార్టీ శ్రేణులతో రాహుల్ జరిపిన మేధోమథనం పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రసంగంలా కాకుండా, పరస్పర చర్చా వేదికలా సాగింది.
మధ్యమధ్యలో డీసీసీ అధ్యక్షులను ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తూనే, ఆయన కూడా వారికి క్లిష్టమైన ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన నేతలను ‘గుడ్’ అంటూ ప్రశంసించారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా సమాధానం చెబితే, నవ్వుతూ ‘ఫెయిల్’ అని అంటూనే వారి వెన్నుతట్టి ఉత్సాహపరిచారు.
ముఖ్యంగా అహింస కాంగ్రెస్ మార్గం.. హింస బీజేపీ విధానం” అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపారు. అనంతగిరిలో జరిగిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. నాయకులు తమ వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని రాహుల్ డీసీసీ శిక్షణ శిభిరంలో వివరించారు. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నదే బీజేపీ ఏకైక ఆలోచన అని, అందుకోసం వారు హింసను కూడా ఆశ్రయిస్తారని విమర్శించారు. ప్రజలను మెప్పించి, వారి మనసు గెలుచుకుని అధికారంలోకి రావడమే కాంగ్రెస్ సిద్ధాంతమని స్పష్టం చేశారు.నాయకులు ఇగో పక్కన పెట్టాలని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ హితమే ముఖ్యమని చెప్పారు. ప్రతి డీసీసీ అధ్యక్షుడు తమ పరిధిలో కనీసం మరో 10 మంది కొత్త నాయకులను తయారు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారిని డీసీసీ అధ్యక్షులే స్వయంగా గుర్తించాలని, నిజాయితీగా పనిచేసే వారికి పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని భరోసా ఇచ్చారు.
మహాత్మా గాంధీని ఉదాహరణగా చూపిస్తూ రాహుల్ భావోద్వేగంగా మాట్లాడారు. “గాంధీజీ ఒంటిపై కేవలం ఒక వస్త్రం తప్ప ఏమీ లేదు.. కానీ శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఆయన్నేమీ చేయలేకపోయింది. అంకితభావంతో ఉంటే అధికారం మన వద్దకే వస్తుంది” అని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు.జిల్లా స్థాయిలో పార్టీకి డీసీసీ అధ్యక్షులే సుప్రీం అని రాహుల్ ప్రకటించారు.మీరంతా నా బృందం. మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రానున్న రోజులన్నీ మనవే.. మనం కలిసి విజయం సాధిస్తామన్నారు రాహుల్.
అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇకపై ‘పైరవీ రాజకీయాలు’ సాగవని, కేవలం ప్రజల్లో ఉండి పనిచేసే వారికే భవిష్యత్తు ఉంటుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. అనంతగిరి శిక్షణ శిబిరంలో డీసీసీ అధ్యక్షులతో ముఖాముఖి చర్చించిన ఆయన, నాయకుల్లో ఉండే మూడు రకాలను విశ్లేషిస్తూ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
అవినీతి, నేరాలకు దూరంగా ఉండాలని నాయకుడనే వాడు నైతికంగా ఉన్నతంగా ఉండాలని రాహుల్ సూచించారు. అవినీతికి పాల్పడే నేతలు ఎప్పటికైనా దొరికిపోతారని, ప్రజల్లో చులకనవుతారని హెచ్చరించారు. నేర చరిత్ర ఉన్న వారికి భవిష్యత్తు ఉండదని, వారి దురాగతాలను ప్రజలు ఎప్పటికైనా గుర్తిస్తారని పేర్కొన్నారు. ఈ రెండింటికీ దూరంగా ఉండేవారే నిజమైన నాయకులని అన్నారు.
దేశంలో కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేస్తూ, సామాజిక న్యాయంపై తన నిబద్ధతను చాటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను గౌరవించాలని, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా లెక్కలు సేకరించి, అత్యంత వెనుకబడిన వారికి తగిన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.కాంగ్రెస్ గుర్తు ‘హస్తం’ వెనుక ఉన్న పరమార్థాన్ని రాహుల్ వివరించారు. ప్రపంచంలోని అన్ని మతాల చిహ్నం ‘అభయ ముద్ర’ అని, అందరికీ రక్షణ కల్పించడమే కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. పార్టీలో మహిళలకు సముచిత గౌరవం ఇచ్చి, వారికి ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీ వీహెచ్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించి, తన అంగీకారాన్ని తెలిపారు.మేమంతా మీ బృందంగా పనిచేస్తాం.. గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తాం అని డీసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి ప్రతిజ్ఞ చేశారు.
ప్రతి నెలా కనీసం 30 గ్రామాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మమేకం అవుతామని స్పష్టం చేశారు. ప్రతి డీసీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ‘ఫిర్యాదుల విభాగం’ ఏర్పాటు చేస్తామని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేస్తామన్నారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇతర కీలక నేతలు రాహుల్ గాంధీని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని కోరారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు మీ రాక అనివార్యమని వారు విన్నవించారు. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే పర్యటన ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఏపీకి చెందిన కొందరు నేతలు రాష్ట్రంలోని సీనియర్ల తీరుపై రాహుల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏపీలోని పలువురు సీనియర్ నాయకులు పార్టీ పటిష్ఠత కోసం ప్రజల్లోకి వెళ్లడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఏపీ నేతలు రాహుల్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. విభజన చట్టంలోని హామీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. చట్టబద్ధంగా ఏపీకి రావాల్సిన హక్కుల కోసం పార్లమెంటులో గట్టిగా గళమెత్తాలని రాహుల్‌ను కోరారు.
యూపీఏ హయాంలో తెచ్చిన చట్టం కాబట్టి, ఆ హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని రాహుల్ వారికి భరోసా ఇచ్చారు.ఏపీ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, విభజన హామీల అమలు కోసం పార్లమెంటులో పోరాడుదామని రాహుల్ అన్నారు.
వికారాబాద్ డీసీసీ శిక్షణ సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మీరు దేశ ప్రధాని కావాలి.. ఇది నా ఒక్కడి కోరిక కాదు, కోట్ల మంది కాంగ్రెస్ కార్యకర్తల ఆకాంక్ష” అంటూ చేసిన విజ్ఞప్తికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. అనంతగిరిలో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
చివరగా, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి అండగా ఉంటానని రాహుల్ భరోసా ఇచ్చారు. “మీరు ప్రజల కోసం పని చేయండి.. మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను” అని ఆయన ఇచ్చిన హామీ డీసీసీ అధ్యక్షుల్లో ధైర్యాన్ని నింపింది.ఈ శిక్షణ శిబిరం ద్వారా రాహుల్ గాంధీ కేవలం పార్టీని సిద్ధం చేయడమే కాకుండా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు తాను ప్రధాని అభ్యర్థిగా సిద్ధమనే సంకేతాలను స్పష్టంగా పంపారు.