తమ్మినేని శకం ముగిసిందా? సీపీఎంలో ‘అభిశంసన’ చిచ్చు: ఎర్రకోటలో ముదిరిన ముఠా రాజకీయం!

తెలంగాణ ఎర్రకోటలో ముదిరిన ముఠా రాజకీయం.. దశాబ్దాల కమ్యూనిస్టు క్రమశిక్షణకు తూట్లు పొడుస్తూ సాగిన అంతర్గత పోరు చివరకు బహిర్గతమైంది. పదేళ్ల పాటు పార్టీని తన కనుసన్నల్లో నడిపిన సీనియర్ నేత తమ్మినేని వీరభద్రంపై సీపీఎం కేంద్ర కమిటీ ‘అభిశంసన’ అస్త్రాన్ని ప్రయోగించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిద్ధాంతాల కంటే స్వంత లాబీయింగ్‌కే పెద్దపీట వేశారని, అస్తిత్వ రాజకీయాలతో పార్టీ అస్తిత్వాన్నే ప్రమాదంలోకి నెట్టారని సాక్షాత్తూ హైకమాండ్ నివేదికలే స్పష్టం చేయడం గమనార్హం. కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా ఏపీలోనూ నేతలపై వస్తున్న ఆరోపణలు.. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికిని, నైతికతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

 

తెలంగాణలో పార్టీ ప్రతిష్ట మసకబారడం, ఎన్నికల్లో వరుసగా ఘోర పరాజయాలు, అగ్రనేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీపీఎం కేంద్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని దెబ్బతీయడం వంటి అంశాలపై దృష్టి సారించి.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్‌‌‌‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.

 

అభిశంసనకు దారితీసిన ప్రధాన కారణాలు..2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నికల సమయంలో తమ్మినేని అనుసరించిన వైఖరిపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా, తన వర్గాన్ని పట్టుబట్టడం ద్వారా ఏకాభిప్రాయానికి అడ్డుపడ్డారని నివేదిక పేర్కొంది.పార్టీ సిద్ధాంతాలకు, నిబంధనలకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీ లైన్‌ను ఉల్లంఘించడం వంటి అంశాలను కేంద్ర కమిటీ తీవ్రంగా పరిగణించింది.

పదేళ్ల పాటు పార్టీని తన కనుసన్నల్లో నడిపిన తమ్మినేని, ఇటీవలి కాలంలో పార్టీ అంతర్గత క్రమశిక్షణను దెబ్బతీసేలా వ్యవహరించారని హైకమాండ్ నిర్ధారించింది.తమ్మినేని వీరభద్రంతో పాటు మరో ఇద్దరు నేతలు స్కైలాబ్ బాబు, ప్రసాద్ పై కూడా అభిశంసన తీర్మానాన్ని ఆమోదించారు.ఇకపై తమ్మినేని రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశాలకు కేవలం పరిశీలకుడిగామాత్రమే హాజరుకావాలని, ఆయనకు ఓటింగ్ లేదా నిర్ణయాధికారం ఉండదని స్పష్టం చేసింది.తమ్మినేని చేసిన తప్పులను వివరిస్తూ కేంద్ర కమిటీ రూపొందించిన 4 పేజీల అభిశంసన పత్రాన్ని రాష్ట్రంలోని అన్ని బ్రాంచ్ కమిటీలకు పంపి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు వివరించాలని ఆదేశించింది.

 

సాధారణంగా సీపీఎంలో ఏ నిర్ణయమైనా సుదీర్ఘ చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా జరుగుతుంది. కానీ, 2024లో కొత్త కార్యదర్శి ఎన్నిక సమయంలో ప్రజాస్వామ్యయుత చర్చకు బదులుగా లాబీయింగ్‌, ప్రలోభాలు రాజ్యమేలాయని కేంద్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తెరవెనుక మంత్రాంగాలు నడిచాయని తప్పుబడుతూ నివేదికలో పేర్కొంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా, తమ్మినేని నేతృత్వంలోని ఒక వర్గం అస్తిత్వవాద రాజకీయాలను తెరపైకి తెచ్చి పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని నివేదిక పేర్కొంది. ఇది పార్టీ మౌలిక సిద్ధాంతాలకే గొడ్డలిపెట్టుగా మారిందని హైకమాండ్ అభిప్రాయపడింది.పార్టీలో ఐక్యతను నెలకొల్పేందుకు మరియు వివాదాలను సర్దుబాటు చేసేందుకు సాక్షాత్తూ పొలిట్‌బ్యూరో సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని నివేదిక వెల్లడించింది. తమ్మినేని సహా ఆయన వర్గం నేతలు పట్టువిడుపులు ప్రదర్శించకుండా వెనక్కి తగ్గడానికి నిరాకరించడాన్ని కేంద్ర నాయకత్వం క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించింది.

మరోవైపు, తనపై చర్యలను తమ్మినేని వీరభద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం. మధురైలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో తమ్మినేని కేంద్ర కమిటీ పనితీరునే ప్రశ్నించినట్లు సమాచారం.తెలంగాణలో సీపీఎం ఉనికి కోల్పోవడానికి తన వ్యక్తిగత నిర్ణయాలు కాదు, కేంద్ర కమిటీ అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలే కారణమని ఆయన ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది.రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కేంద్ర నాయకత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను తనపైకి నెడుతున్నారనేది తమ్మినేని వర్గం ప్రధాన వాదనగా కనిపిస్తోంది.

 

పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై లోతైన విచారణ కోసం కేంద్ర కమిటీ శ్రీదీప్ భట్టాచార్య, కె. బాలకృష్ణన్లతో కూడిన ప్రత్యేక కమిషన్‌ను నియమించింది. వీరి దర్యాప్తులో వెల్లడైన ముఖ్యాంశాలు వెల్లడించింది. తమ్మినేని రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో అనుసరించిన విధానాలు పార్టీని బలహీనపరిచాయని కమిషన్ పేర్కొంది. ముఖ్యంగా అధికార పార్టీల పట్ల ఆయన వహించిన వైఖరి కేడర్‌లో అయోమయానికి దారితీసిందని తేల్చింది.ఒకప్పుడు శాసనసభలో బలమైన గళం వినిపించిన సీపీఎం, తమ్మినేని సారథ్యంలో వరుసగా రెండు పర్యాయాలు 2018, 2023 అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయింది. ఈ చారిత్రక వైఫల్యానికి ఆయన బాధ్యత వహించాలని కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

తమ్మినేని హయాంలో జరిగిన అతిపెద్ద వైఫల్యం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ప్రయోగంగా పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టు మూల సిద్ధాంతాలకు భిన్నంగా చేసిన ఈ ప్రయోగం క్షేత్రస్థాయిలో విఫలమవ్వడమే కాకుండా, పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీసింది.గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఊగిసలాట ధోరణి ప్రదర్శించి, చివరి నిమిషంలో ఒంటరి పోరుకు వెళ్లడం వల్ల కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఇది పార్టీని రాజకీయంగా అట్టడుగు స్థాయికి నెట్టివేసిందని హైకమాండ్ నిర్ధారించింది.

 

ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యదర్శి ఎంపిక ప్రక్రియలో తమ్మినేని వ్యవహరించిన తీరు వివాదానికి ప్రధాన కేంద్ర బిందువైంది.తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, పార్టీపై పట్టును కోల్పోకూడదనే ఉద్దేశంతో తనకు అనుకూలమైన వ్యక్తినే కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టాలని తమ్మినేని ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర కమిటీ ఒక పేరును ప్రతిపాదించినప్పటికీ, దానిని లెక్కచేయకుండా మరో వ్యక్తిని నిలబెట్టి ఓటింగ్ వరకు తీసుకెళ్లడం పార్టీ చరిత్రలో అరుదైన మరియు క్రమశిక్షణారాహిత్య చర్యగా పరిగణించబడింది.

 

ఈ తీవ్రమైన పరిణామాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు స్పందించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. అవన్నీ పార్టీ అంతర్గత విషయాలు. నిర్మాణ పరమైన అంశాలపై బహిరంగంగా మాట్లాడబోను అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. తాను కేవలం రాజకీయ అంశాలపైనే స్పందిస్తానని చెబుతూ, పార్టీ క్రమశిక్షణ చర్యల నుండి తనను తాను వేరుచేసుకునే ప్రయత్నం చేశారు.దశాబ్దాలుగా క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీలో, అగ్రనేతపై చర్యలు తీసుకుంటే దానిని సమర్థించడమో లేదా వివరణ ఇవ్వడమో చేయకుండా.. అది మా అంతర్గత విషయం అనడంపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది.

 

తెలంగాణలో ఈ గొడవ జరుగుతుండగానే, ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యవర్గంపై కూడా పలు ప్రచారాలు వెలుగు చూస్తున్నాయి.ఏపీ నాయకత్వంపై కూడా కేంద్ర కమిటీ గుర్రుగా ఉందనే వార్తలు, పార్టీ క్రమశిక్షణకు పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మారాయి.తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కమ్యూనిస్టులు, ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదైనా తప్పు జరిగితే ‘ఆత్మవిమర్శ’ చేసుకోవడం కమ్యూనిస్టుల సంప్రదాయం. కానీ, తమ్మినేని ఎపిసోడ్‌లో ఆ ఆత్మవిమర్శ లోపించిందని, మొండివైఖరి పెరిగిందని కేంద్ర కమిటీ ఘాటుగా విమర్శించడం పార్టీలోని సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. అగ్రనేత బి.వి. రాఘవులు వంటి వారు దీనిని ‘అంతర్గత విషయం’ అని దాటవేస్తున్నా, క్షేత్రస్థాయిలో కేడర్‌కు మాత్రం ఇది మింగుడుపడటం లేదు. శాసనసభలో గళం కోల్పోవడం, వరుస ఎన్నికల పరాజయాలు, ముఠా తగాదాల మధ్య నలిగిపోతున్న సీపీఎం.. ఈ ‘అభిశంసన’ ప్రక్షాళనతోనైనా మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందా? లేక అంతర్గత పోరుతో మరింత బలహీనపడుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.”