చమురు సెగలు: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో భగ్గుమంటున్న ఆయిల్ ధరలు.. భారత్‌పై రూ.13 వేల కోట్ల భారం!

క్రూడాయిల్‌ ధరలపై ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ పడనుంది. ప్రపంచ దేశాలకు ఇరాన్‌ యుద్ధం క్రూడాయిల్ ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్ మూసేసింది. చమురు రవాణా నౌకలపై ఇరాన్‌ దాడులు చేస్తుంది. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ఏప్రిల్‌ నాటికి కాంట్రాక్ట్‌ బ్యారెల్‌కు 10 శాతం పెరుగుదల కనిపించనుుంది. భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నట్లు చెబుతున్నారు.బ్యారెల్‌కు ఒక డాలర్‌ పెరిగినా ఏడాదికి భారత్‌పై 13 వేల కోట్ల భారం పడనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోలు ధరలు పెంచే అవకాశముందని భారతీయుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణంతొ ప్రపంచవ్యాప్త చమురు సరఫరాకు కీలకమైన చమురు డిపోలు, రిఫైనరీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. చమురు నిల్వలపై దాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల నుంచి జరిగే చమురు రవాణా ఆగిపోవడం వల్ల ప్రపంచ దేశాల్లో రానున్న కాలంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ చమురు క్షేత్రాల వద్ద భద్రతను అత్యున్నత స్థాయికి పెంచాయి. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున, చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. బహుముఖ దాడులు ఇరాన్ కేవలం ఒక దేశాన్ని మాత్రమే కాకుండా, ఏకకాలంలో ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, మరియు గల్ఫ్ దేశాలపై వందలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ మరియు జోర్డాన్‌లోని అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీనివల్ల అమెరికా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఎంతకాలమైన యుద్ధం జరిగి తీరుతుందని ట్రంప్ ప్రకటించటం మార్కెట్లను కుదిపేస్తోంది.

 

 

పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. తన క్షిపణులను నేరుగా వారిపై ప్రయోగించాల్సింది పోయి, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇది ఇరాన్ బలహీనతా? లేక వ్యూహాత్మక చర్యలో భాగంగా వేస్తున్న ఒక ఎత్తగడా? అసలు పొరుగు దేశాలే ఇరాన్ టార్గెట్‌గా ఎందుకు అయ్యాయి? అనే అంశాలు చూద్దాం.

 

ఇరాన్ తన క్షిపణులను ఇరుగుపొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం.. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు. బహ్రెయిన్, కతార్, కువైట్‌.. వంటి ప్రాంతాల్లో అమెరికాకు చెందిన భారీ నౌకాదళ, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడుల్లో ఈ స్థావరాలే వేదికలయ్యాయి. దాంతో నేరుగా వాషింగ్టన్‌పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్‌లను లక్ష్యంగా చేసుకుంది.

 

గతంలో ఇరాన్ తన పరోక్ష యుద్ధాన్ని హమాస్, హిజ్బుల్లా ద్వారా నడిపించేది. కానీ 2024-25 మధ్య జరిగినపరిణామాల్లో ఇజ్రాయెల్ ఈ గ్రూపులను తీవ్రంగా దెబ్బతీసింది.
సిరియాలో అస్సాద్ ప్రభుత్వం కూలిపోవడం, హిజ్బుల్లా నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్ కొంత బలహీనపడింది. దీంతో తన ఉనికిని చాటుకోవడానికి పొరుగున ఉన్న ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. యుద్ధం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే,
గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందని అభిప్రాయాలున్నాయి.
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ ప్లాన్. పొరుగు దేశాలపై దాడులు చేయడం
ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయనే హెచ్చరికను ఇరాన్ పంపాలని చూస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

 

2026 జనవరి నుంచి ఇరాన్ తీవ్రమైన దేశీయ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బయటి దేశాలపై దాడులు చేయడం ద్వారా జాతీయవాదాన్ని రగిల్చి ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించాలని ఇరాన్ పాలకులు చూస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌లో పాలన మార్పును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, కీలక నాయకత్వంపై కూడా జరుగుతున్నాయి. తమ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఒక గాయపడిన సింహంలా ఇరాన్ తన పక్కనున్న చిన్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఇది అమెరికాను చర్చల వైపు మళ్లించే ప్రయత్నం కూడా కావచ్చని కొందరి అభిప్రాయం.