తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్కే! ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి.. మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సిపిఐ మధ్య చిచ్చు పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన చేతులు.. ఇప్పుడు అధికారం కోసం ఆధిపత్య పోరుకు దిగుతున్నాయి. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే మావాడు.. పదవి మాకే అని కమ్యూనిస్టులు పట్టుబడుతుంటే, మరోవైపు జిల్లాలో తిరుగులేని శక్తి మాది.. భవిష్యత్ ప్లాన్ మాకుంది అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మిత్ర ధర్మం నిలబడుతుందా? లేక మంత్రి వ్యూహం ఫలిస్తుందా?
కొత్తగూడెం అభివృద్ధి సంస్థ (KUDA)కుడా చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ సిపిఐ మధ్య పోటీ నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అనుచరులు రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పొత్తు ధర్మంలో భాగంగా తమకే కేటాయించాలని కూనంనేని అనుచరులు కోరుతున్నారు. అధికార పార్టీగా తామే తీసుకుంటాం అన్నది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
కుడా చైర్మన్ పదవి కోసం మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) పట్టుపట్టడం వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ప్రణాళికలో భాగంగానే కుడా వ్యవహారాల్లో వేలు పెడుతున్నారా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తే ఏం జరిగిందో గుర్తుపెట్టుకోలేదా..? కమ్యూనిస్టులు కోరుతున్న కాంగ్రెస్ కు కనువిప్పు కావడం లేదా? అక్కడి రాజకీయవర్గాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి.
కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కొత్తగా ఏర్పడిన పట్టణాభివృద్ధి సంస్థ కూడా చైర్మన్ పదవి అంశం ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ( Congress Vs CPI) మధ్య వివాదంగా మారింది.తమకంటే తమకే కావాలని రెండు పార్టీలు పట్టుపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసిన మిత్ర ధర్మంతో పాటు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీగా తమకే కావాలన్నది సిపిఐ డిమాండ్. అధికార పార్టీగా తామే తీసుకుంటామన్నది కాంగ్రెస్ వాదన. దీంతో కుడా చైర్మన్ ఎంపిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతా నగర్ మండలంలో ఏడు గ్రామ పంచాయతీలు విలీనం చేసి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కొలువు తీరింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికల్లో సిపిఐ సత్తా చాటడంతో ఎర్రజెండా ఎగిరింది. మేయర్ పీఠం కామ్రేడ్స్ కైవసమైంది. మేయర్ గా సిపిఐ కార్పొరేటర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ సిరిపురపు లలిత ఎన్నికయ్యారు. పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా స్థాయిని పెంచుకున్న కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటయింది. సంస్థ చైర్మన్ ఎంపిక ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.
కాంగ్రెస్ సిపిఐ నేతలు రేస్ లో ఉన్నారు. కుడా చైర్మన్ పదవి కోసం రెండు పార్టీల నుంచి కొందరు నేతలు పోటీ పడుతున్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ సీనియర్లు మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగూడెం నియోజక వర్గంలో (Kothagudem)పట్టు కోసం పొంగులేటి ప్రయత్నిస్తున్నారు.
నగరపాలక సంస్థ ఎన్నికల్లో పట్టు బిగించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. కొత్తగూడెంలో భవిష్యత్తు రాజకీయం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఈ మంత్రి ఆలోచనగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే తన అనుచరులకు నామినేట్ పదవులు దక్కించుకునే ప్లాన్ లో పొంగులేటి ఉన్నారు.
మరికొందరు కాంగ్రెస్ నేతలు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై (Mallu Bhatti Vikramarka) ఆశలు పెట్టుకున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి నియామకాల్లో భట్టి పొంగులేటి వర్గీయుల మధ్య పెద్ద రగడ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కుడా చైర్మన్ నియామకాల్లో అలా జరగకుండా టీపిసిసి (TPCC) జాగ్రత్తలు తీసుకుంటోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అనుచరులు కూడా ఈ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారని వినిపిస్తోంది.
కాంగ్రెస్ లో ముగ్గురు మంత్రుల ఫాలోవర్స్ మధ్య పోరుతో పాటు కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(kunamneni Sambha Shivarao) ద్వారా కమ్యూనిస్టులు కుడా చైర్మన్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంపిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొత్తగూడెం పాలిటిక్స్ మంత్రి పొంగులేటి వర్సెస్ కూనంనేనిగా మారాయి. స్థానిక ఎమ్మెల్యేగా కూనంనేని సిపిఐ నేతలకు కుడా చైర్మన్ పదవిని ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పొత్తులో భాగంగా కూనంనేని సాంబశివరావు ఇక్కడ గెలిచారు.
ఈ పదవి విషయంలో మంత్రి పొంగులేటి పంతాలకు పోతే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఏమైందో గుర్తుపెట్టుకోవాలని ఎర్రజెండా నాయకులు గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Muncipal Corporation Elections) రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో చెరో 22 స్థానాలు దక్కాయి. బిఆర్ఎస్ ఎనిమిది డివిజన్లను గెలుచుకుంది. మేయర్ పీఠం కోసం మ్యాజిక్ ఫిగర్ 31 కావడంతో ఈ క్రమంలోనే బిఆర్ఎస్ సిపిఐ కి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Reventh Reddy)జోక్యం చేసుకొని మిత్ర ధర్మం దెబ్బతినకుండా సిపిఐ కి మేయర్ పదవి కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్ పోస్ట్ ఇచ్చేలా సర్దుబాటు చేయడంతో సమస్య లేకుండా పోయింది.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న అనుభవం ఉన్నా.. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. కుడా చైర్మన్ పదవి కేవలం ఒక నామినేటెడ్ పోస్ట్ మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ఒక కీలకం. మంత్రి పొంగులేటి తన వర్గాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంటే, ఎమ్మెల్యే కూనంనేని తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
గతంలో మేయర్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మిత్ర ధర్మాన్ని కాపాడారు. మరి ఇప్పుడు కుడా విషయంలో కూడా సీఎం అదే ఫార్ములానే పాటిస్తారా? లేక మంత్రి పంతానికే తలొగ్గుతారా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఈ పదవి దక్కని పక్షంలో కాంగ్రెస్-సిపిఐ బంధం కొత్తగూడెం వేదికగా బీటలు వారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.