17 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న సీన్: నాడు కేసీఆర్.. నేడు కవిత! ఖమ్మం సెగతో పీఠం కదులుతుందా?

నాడు ఖమ్మం ఆసుపత్రి బెడ్‌పై నుంచి కేసీఆర్ విసిరిన సవాల్‌తో ఢిల్లీ పీఠం కదిలింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది. సరిగ్గా అదే సెంటిమెంట్‌ను అందిపుచ్చుకున్నారో ఏమో కానీ.. కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. బీఆర్ఎస్ వైరాగ్యాన్ని వీడి, “తెలంగాణ జాగృతి” జెండా పట్టుకుని జనంలోకి వచ్చిన ఆమె.. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన ఆమె చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేడు మూడో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ‘ఖమ్మం’ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. అది విప్లవాలకైనా, రాజకీయ మార్పులకైనా కేరాఫ్ అడ్రస్. నాడు కేసీఆర్ తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురవుతున్న తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఎంచుకున్న వేదిక ఖమ్మం. సరిగ్గా పదిహేడేళ్ల తర్వాత, అదే ఖమ్మం వేదికగా కల్వకుంట్ల కవిత తన సరికొత్త రాజకీయ అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. అయితే ఈసారి ఆమె చేతిలో గులాబీ జెండా లేదు.. సొంతంగా నిర్మించుకున్న ‘తెలంగాణ జాగృతి’ బలముంది.

ఖమ్మం టూ హైదరాబాద్.. అదే పంతం!
వెలుగుమట్ల భూ బాధితుల కోసం ఖమ్మంలో పోరాటం మొదలుపెట్టిన కవితను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆపై హైదరాబాద్‌కు తరలించడం చకచకా జరిగిపోయాయి. అయితే, జైలు గోడలు లేదా గృహ నిర్బంధాలు తనను ఆపలేవంటూ ఆమె హైదరాబాద్ వేదికగా దీక్షను కొనసాగిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తండ్రి బాటలో..: 2009లో కేసీఆర్ “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అన్న నినాదంతో ఎలాగైతే సంచలనం సృష్టించారో, ఇప్పుడు కవిత కూడా అదే పంథాను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.జాగృతి నుంచి జనం ముందుకు: ఇన్నాళ్లూ కేవలం సాంస్కృతిక వేదికగా ఉన్న తెలంగాణ జాగృతిని, ఇప్పుడు రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నంలో ఆమె సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇన్నాళ్లూ బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేతగా, కేసీఆర్ కూతురిగా మాత్రమే గుర్తింపు పొందిన కవిత, ఇప్పుడు ఆ ఛట్రం నుంచి బయటకు వచ్చారు. గత సెప్టెంబర్‌లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచే ఆమె అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. వెలుగుమట్ల బాధితుల పక్షాన ఆమె చేపట్టిన పోరాటం కేవలం ఒక స్థానిక సమస్యపై నిరసన మాత్రమే కాదు.. అది రాష్ట్రవ్యాప్తంగా తన నాయకత్వాన్ని చాటుకునే ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్.

వచ్చే ముఖ్యమంత్రి నేనే.. ధీమానా? వ్యూహమా?
వచ్చే రెండు నెలల్లో కొత్త పార్టీ పెడతానని ప్రకటించడమే కాకుండా, “వచ్చే సీఎం నేనే” అంటూ కవిత చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పేరు వినిపిస్తున్న తరుణంలో, కవిత నేరుగా ప్రజల్లోకి వెళ్లి సెంటిమెంట్‌ను రగిలించడం గులాబీ గూటిలోనూ, ప్రతిపక్షాల్లోనూ కలకలం రేపుతోంది.తెలంగాణ బిడ్డ కన్నీరు తుడిచే వరకు ఈ దీక్ష ఆగదు. నాడు ఉద్యమ గడ్డ ఖమ్మం నాన్నకు అండగా నిలిచింది, నేడు నన్ను ఆశీర్వదిస్తోందని కవిత అన్నారు.

మలుపు తిరగనున్న పాలిటిక్స్?
ప్రస్తుత నిరాహార దీక్ష కేవలం బాధితుల కోసమేనా? లేక తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడానికా? అనే సందేహాలు వస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆమెకు మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను, సెంటిమెంట్‌ను నమ్ముకున్న కవిత.. తండ్రి తరహాలోనే పోరాట యోధురాలిగా ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు.రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కవిత చుట్టూ తిరుగుతున్నాయి. తండ్రి కేసీఆర్ ఉద్యమ సెంటిమెంట్‌ను, ఖమ్మం గడ్డ సెంటిమెంట్‌ను కలగలిపి ఆమె విసురుతున్న పాచికలు ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీక్ష మూడో రోజుకు చేరడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

తెలంగాణలో రాజకీయం ఇప్పుడు ముక్కోణపు పోటీ నుంచి చతుర్ముఖ పోటీగా మారుతోంది. కేసీఆర్ గారాల పట్టిగా కాకుండా, ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని కవిత వేస్తున్న అడుగులు ఫలిస్తాయా? ఖమ్మం గడ్డ ఇచ్చిన ‘పవర్’ ఆమెను నిజంగానే ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకెళ్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి, కవిత దీక్షతో తెలంగాణ రాజకీయాల్లో ‘జాగృతి’ మొదలైందనేది మాత్రం నిఖార్సైన నిజం!

రాబోయే 60 రోజులు తెలంగాణ రాజకీయాలకు అత్యంత కీలకం కానున్నాయి. కొత్త పార్టీ ప్రకటన, కవిత పాదయాత్ర చేపట్టే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ చదరంగం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖమ్మం సెగ కేసీఆర్ కూతురిని సీఎం పీఠం వరకు చేరుస్తుందో లేదో చూడాలి!