తెలంగాణలో రేవంత్ రెడ్డికి అసంతృప్తులను బుజ్జగించటం కామనైపోయింది. అయితే.. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల వరకు రేవంత్ తన స్టైల్‌కు భిన్నంగా వ్యవహరించారు. తర్వాత జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో అసంతృప్తులపై కొరడా విదిలిస్తున్నారు. కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ దాటి నెక్స్ట్ లెవెల్ కు కూడా వెళ్ళినా.. డోంట్ కేర్ అని రేవంత్ అనేస్తున్నారు. దీంతో.. తెలంగాణలో ఓ సీనియర్ పొలిటిషియన్ .. కాంగ్రెస్‌లో నేను వేగలేనని అనేస్తున్నాడు. నియోజకవర్గంలో ఆ లీడర్ ఇస్తున్న హింట్స్ చూస్తున్నవారు.. అతను ఎటువైపు వెళ్లాడని ఆసక్తిగా గమనిస్తున్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాం.. రాం అనేస్తున్నాడంట. జగిత్యాల పొలిటికల్ ఎపిసోడ్.. కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. ఇంతకీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంత స్ట్రాంగ్ డెషిషన్ తీసుకోవటానికి కారణాలు ఏంటి..?
కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉండే పరిస్థితి కనిపించట్లేదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయట. మరికొద్ది జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని టాక్ వస్తోంది. అసలు జీవన్ రెడ్డి హస్తం పార్టీకి బై.. బై చెప్పటం ఖాయమేనా? కాంగ్రెస్ ని విడితే ఆయన నెక్స్ట్ స్టెప్ ఎటువైపు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోందట. ఇప్పుడిదే జగిత్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారని ఏ నలుగురు కలిసినా తెగ చర్చించుకుంటున్నారు. జగిత్యాల పాలిటిక్స్‌లో జీవన్ రెడ్డి మూడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పలుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన జీవన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
జగిత్యాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్‌ను నిర్మించిన నాయకుల్లో జీవన్ రెడ్డిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో జీవన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఒకప్పుడు జగిత్యాల రాజకీయాల్లో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనే పరిస్థితి ఉండేది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో జీవన్ రెడ్డి ఓటిమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంతమేర తగ్గిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండోసారి బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు జీవన్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ సంజీవ్ కుమార్ అధికార కాంగ్రెస్‌లోకి రావటాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ వేదికల్లోనూ, బహిరంగంగానూ తన అసంతృప్తిని వెలగక్కుతూ వచ్చారు. ఈ అసంతృప్తిని ఏనాడూ జీవన్ రెడ్డి దాచుకోలేదు. పైగా గాంధీభవన్లోనూ కంటిన్యూ అవుతూనే ఉంది. మంత్రుల ముందే గాంధీభవంలో ప్రొటెస్ట్ చేసి తన నిరసనను వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాకను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలో తన మనుషులకు టికెట్లు దక్కకపోవడం, ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం సొంతంగా అభ్యర్థులను పోటీకి పెట్టి గెలిపించుకోవడం జరిగిపోయాయి. చివరకు చైర్మన్ నియామకంలోనూ తన మాటకన్నా ఎమ్మెల్యే సంజయ్‌కే కాంగ్రెస్ పార్టీ ఓకే అనటంపై జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు .
జంపింగ్‌లను ప్రోత్సహించడంపైన రాష్ట్ర నాయకత్వం తీరుపై నిర్సిస్తూ ఏఐసిసి కి లేఖ రాశారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌కు బహిరంగంగా లేఖ రాసి చర్చకు దారి తీశారు. అయితే కాంగ్రెస్ హై కమాండ్ వైఖరి కూడా జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందట. అటు అధిష్టానం కూడా జీవన్ రెడ్డి పై చర్యలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేసినట్లు తెలుస్తుంది. సీనియర్ నేత పైన క్రమశిక్షణ చరలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పైగా జీవన్ రెడ్డికి సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అటు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడకపోవడం ఒకే ఎత్తైతే… నిరసనలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో జీవన్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పిస్తోందని అనుచరలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలని అనుచరుల ఒత్తిడి తెస్తున్నారట.
ప్రస్తుత పరిస్థితిలో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం పైన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఓపెన్ గానే ప్రకటించేశారు జీవన్ రెడ్డి. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడితే ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది చర్చని అంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్, బీజేపీల్లో చేరే అవకాశాలపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బిఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలతో పలు దఫాలు మంత్రనాలు జరిపినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జీవన్ రెడ్డి నిజంగా బిఆర్ఎస్, బీజేపీల్లో చేరితే జగత్యాల రాజకీయాలలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన వెంట క్యాడర్ వెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ దెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఆయన ఏ పార్టీలో ఇప్పటికే స్థానిక నాయకత్వం బలంగా ఉన్న జీవన్ రెడ్డి రాకతో జగిత్యాలలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జీవరెడ్డి పార్టీ మార్పుపై ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆయన తీసుకునే నిర్ణయం జగిత్యాల జిల్లా రాజకీయాలపై మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతుంది.
త్వరలోనే దీనిపై మరింతక్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. జీవరెడ్డి అడుగులు ఎటువైపు పడతాయో అని జగిత్యాల వాసులు కూడా వేచి చూస్తున్నారు. మొత్తానికి సీనియర్ నేతను బుజ్జగించటంలో టీపీపీసీ వైఫల్యమూ కనిపిస్తోందని జీవన్ రెడ్డి లాంటి నాయకుడ్ని కోల్పోతే.. కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని జగ్గారెడ్డి లాంటి వాళ్లు పార్టీని హెచ్చరించటం కొసమెరుపు.