సింగనమలలో ‘శైలజానాథ్’ ఎంట్రీ.. సాంబశివారెడ్డి చెక్ పెడతారా? జొన్నలగడ్డ దంపతుల కొత్త వ్యూహం ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు రాజకీయ నేతల్లో కొత్త కాక పుట్టిస్తోంది. ముఖ్యంగా ఒక కీలక నేతకు ఈ మార్పు వరంలా మారుతుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందని ఆ నేత ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతానికి కాలం కలిసి వచ్చినట్లు కనిపిస్తుండటంతో, ఆ నేతతో పాటు ఆయన భార్య కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఒకవేళ సమీకరణాలు మారి తనకు అవకాశం రాకపోయినా, తన భార్యకైనా టికెట్ దక్కడం ఖాయమని ఆ నేత ధీమాగా ఉన్నారు. అయితే, రాజకీయాల్లో ‘కుడి ఎడమైతే గొడవే’ అన్న చందంగా.. చిన్న పొరపాటు జరిగినా మొత్తం లెక్కలు తారుమారు అవుతాయన్న టెన్షన్ ఆ పొలిటికల్ కపుల్‌ను వెంటాడుతోంది.కొందరిలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ఈ పునర్విభజన ప్రక్రియ, మరికొందరిలో తమ రాజకీయ కోటలు ఎక్కడ బద్దలవుతాయోనన్న ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లుగా నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యం బీటలు వారుతుందా అనే భయం సదరు నేతల్లో అలజడి రేపుతోంది.

అనంతపురం జిల్లా రాజకీయాల్లో జొన్నలగడ్డ దంపతుల ప్రస్థానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన, మారుతున్న రాజకీయ సమీకరణాలపై లోతైన విశ్లేషణల్లో మునిగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తూ, పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారు.సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో, సాంబశివారెడ్డికి నేరుగా పోటీ చేసే అవకాశం దక్కలేదు.

తన భర్తకు అవకాశం లేకపోవడంతో, 2014 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆమెకు విజయం వరించలేదు.ప్రస్తుతం మారుతున్న రాజకీయ ముఖచిత్రం నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ దంపతుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన పద్మావతికి, మొదట మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. అయితే, అప్పట్లో నెలకొన్న రాజకీయ సమీకరణాల వల్ల ఆమెకు ఆ అవకాశం దక్కలేదు.మరోవైపు, ఆమె భర్త సాంబశివ రెడ్డికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత లభించింది. క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన పాఠశాల విద్యాశాఖ నియంత్రణ పర్యవేక్షణ కమిటీలో వరుసగా రెండుసార్లు ఆయనకు కీలక పదవులు దక్కాయి. ఆయనకు జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం గురించి పార్టీ క్యాడర్ కూడా గొప్పగా చెప్పుకునేది.

అయితే, అనూహ్యంగా 2024 ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వారికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత భారీ మెజారిటీతో గెలిచిన పద్మావతికి మంత్రి పదవి దక్కలేదు. కాగా సాంబశివ రెడ్డికి మాత్రం ప్రాధాన్యత వరుసగా రెండుసార్లు క్యాబినెట్ ర్యాంక్ పదవులు వరించాయి.

సింగనమల రాజకీయాల్లో గత కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్నప్పటికీ, సొంత పార్టీ నేతల నుంచే ఎదురైన తీవ్ర వ్యతిరేకత ఆమె అవకాశాలను దెబ్బతీసింది.

గత ఎన్నికల సమయంలో పద్మావతికి టికెట్ ఇస్తే సహకరించబోమని స్థానిక నేతలు తిరుగుబాటు చేయడంతో అధిష్టానం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో ఆమె భర్త సాంబశివరెడ్డి సూచన మేరకు, ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులకు అనూహ్యంగా టికెట్ కేటాయించారు. అయితే, 2024 ఎన్నికల్లో ఈ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ వైఫల్యం తర్వాత వైసీపీ అధిష్టానం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఆయనకు బలమైన క్యాడర్, పట్టు ఉన్నాయి.

ప్రస్తుతం నియోజకవర్గంలో శైలజానాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, అనుభవం దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో సింగనమల వైసీపీ అభ్యర్థిగా ఆయనే బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అప్పట్లో పద్మావతికి తప్పిన అవకాశం, ఇప్పుడు శైలజానాథ్‌ను వరిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో శైలజనాథ్ పేరు మళ్ళీ తెరపైకి రావడంతో, జొన్నలగడ్డ దంపతుల కథ మరోసారి మొదటికి వచ్చినట్లయింది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం అటు ఆశలను, ఇటు తీవ్ర ఆందోళనలను పెంచుతోంది.గత కొంతకాలంగా తెరవెనుక రాజకీయాలకే పరిమితమైన సాంబశివ రెడ్డి, ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పునర్విభజన ప్రక్రియ పూర్తయితే, సమీకరణలు మారి తనకు ఖచ్చితంగా టికెట్ దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న గుబులు ఆయనను వెంటాడుతూనే ఉంది.

పునర్విభజన జరిగితే సింగనమల నియోజకవర్గం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. భౌగోళికంగా సింగనమల రెండుగా విడిపోయే ఛాన్స్ ఉంది. నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇది మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే సాంబశివ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. అప్పుడు జొన్నలగడ్డ దంపతులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

 

ఈ స్థానం యధావిధిగా ఎస్సీ రిజర్వ్‌డ్‌గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తుండటంతో, ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మాజీ మంత్రి శైలజానాథ్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు సాంబశివారెడ్డి తనదైన లెక్కలతో వ్యూహాలు రచిస్తున్నారు.

సాంబశివారెడ్డి వర్గంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో చీలికలు ఉన్నప్పటికీ, తనకు అవకాశం దక్కుతుందనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే, ఒకవేళ సమీకరణాలు మారితే ‘మహిళా కోటా’ను అస్త్రంగా వాడుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో, ఈ దంపతుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ప్రస్తుత రాజకీయ పరిణామాల ప్రకారం.. అనంతపురం జిల్లాలో కనీసం 3 నుండి 4 స్థానాలను మహిళలకు కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే తనకు టికెట్ దక్కని పక్షంలో, తన భార్యకు మహిళా కోటాలో సీటు సాధించుకోవచ్చని సాంబశివారెడ్డి గట్టిగా నమ్ముతున్నారు.జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి ఆమెకు అవకాశం దక్కేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్లు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే శైలజానాథ్ లాంటి సీనియర్ నాయకుడిని కాదని సాంబశివారెడ్డికి లేదా ఆయన భార్యకు అవకాశం దక్కుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీ అధిష్టానం కేవలం గెలుపు గుర్రాలనే పరిగణనలోకి తీసుకుంటే, సాంబశివారెడ్డి వేస్తున్న ఈ ‘మహిళా సెంటిమెంట్’ లెక్కలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.