కవిత ‘TRS’ స్కెచ్.. కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదే!

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరు మొదలైందా? పాత పేరు.. కొత్త ఎజెండా అంటూ కవిత లీకులు ఇస్తుంటే.. అయ్యో ఆ పేరును మిస్ అవుతున్నామంటూ కేటీఆర్ ఎమోషనల్ అవుతున్నారు. ‘గులాబీ’ గూటిలో ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ కాబోతుందా? అసలు ఈ టైటిల్ ఎవరి సొంతం కానుంది? అన్నా-చెల్లెళ్ల మధ్య ఈ పేరు చుట్టూ జరుగుతున్న రాజకీయం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి?

 

తన కొత్త పార్టీ పేరులో ‘టీఆర్ఎస్’ అనే పదం ఖచ్చితంగా ఉండేలా కవిత ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు, కార్యకర్తల మనోభావాల పేరుతో కేటీఆర్ కూడా టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను తవ్వి తీస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ వైపు మళ్ళడం కేవలం పార్టీ పేరు మార్పు మాత్రమేనా.. లేక అధికారం కోల్పోయాక పోగొట్టుకున్న ‘తెలంగాణ’ సెంటిమెంట్‌ను మళ్ళీ క్యాచ్ చేసే ప్రయత్నమా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్.ఒక పార్టీ పేరును మార్చాలన్నా లేదా అదే పేరుతో కొత్త పార్టీ పెట్టాలన్నా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.

బీఆర్ఎస్ కార్యవర్గ తీర్మానం చేసి ఈసీకి పంపిస్తే, పేరు మార్చుకోవచ్చు. అయితే టీఆర్ఎస్ అనే పేరు ప్రస్తుతం అందుబాటులో ఉందా లేదా అనేది ముఖ్యం.ఒకవేళ కవిత కొత్త పార్టీ పెట్టి ‘టీఆర్ఎస్’ అనే పేరు కోరితే, ఆ పేరుపై అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఉన్న రిజిస్టర్డ్ పేర్లతో పోలిక ఉంటే ఈసీ అనుమతి లభించడం కష్టం.

ఒకప్పుడు ‘కారు – సారు – సర్కారు’ అంటూ ఏకతాటిపై నడిచిన గులాబీ శ్రేణుల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి BRSగా మారిన తర్వాతే పార్టీకి కష్టాలు మొదలయ్యాయన్న వాదన కేడర్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి కళ్లు మళ్ళీ ‘TRS’ అనే పాత పేరు మీద పడ్డాయి. ఆ పేరును దక్కించుకునేందుకు కేటీఆర్, కవిత మధ్య లోపాయికారీ యుద్ధం నడుస్తోందా? పాత పేరు.. కొత్త ఎజెండాతో కవిత హింట్ ఇచ్చారా? అసలేం జరుగుతోంది?

 

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన TRS పేరును వదులుకోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామన్నది పార్టీ శ్రేణుల అంతర్గత మధనం. ఇప్పుడు అదే పేరును మళ్ళీ తెరపైకి తెచ్చి కేడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు.మనం TRS పేరును మిస్ అవుతున్నాం.. పేరు మార్పు వల్లే నష్టపోయాం అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారితీశాయి. అంటే మళ్ళీ పేరు మార్పు ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.మరోవైపు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.

“TRS పేరు ఇప్పుడు ఖాళీగానే ఉంది.. ఆ టైటిల్ ఎవరైనా వాడుకోవచ్చు” అంటూ ఆమె బాంబు పేల్చారు. తన సొంత పార్టీ పేరు కూడా TRS కావొచ్చంటూ ఆమె ఇచ్చిన హింట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. తెలంగాణ అనే పదం చుట్టూ తిరిగే రాజకీయం TRS పేరుతో ముడిపడి ఉంది. ఇప్పుడు BRS గ్రాఫ్ పడిపోవడంతో, మళ్ళీ పాత బ్రాండ్ నేమ్ ద్వారానే పునర్వైభవం వస్తుందని గులాబీ శ్రేణులు నమ్ముతున్నాయి. అయితే ఈ ‘టైటిల్ వార్’ లో పైచేయి ఎవరిది? కేటీఆర్ ఆకాంక్ష నెరవేరి BRS మళ్ళీ TRS అవుతుందా? లేక కవిత చెప్పినట్లు ఆ ఖాళీగా ఉన్న టైటిల్‌తో కొత్త సమీకరణాలు మొదలవుతాయా? అన్నది ఇప్పుడు సస్పెన్స్!

గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 2022 డిసెంబర్ 8న టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తిస్తూ బులెటిన్ విడుదల చేసింది. అయితే, ఇప్పుడు మరో నేత తన పార్టీ పేరును రిజిస్టర్ చేసే క్రమంలో పాత టైటిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, అదే సమయంలో “తమ పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చు” అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ పేరు మార్చిన సమయంలోనే “టీఆర్ఎస్” అనే టైటిల్‌ను ఇతరులకు కేటాయించవద్దని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.

 

సాధారణంగా ఒక పార్టీ పేరు మారినప్పుడు, పాత పేరును సుమారు ఆరేళ్లు ‘ఫ్రీజ్’ చేయాలని కోరే అవకాశం ఉంటుంది. అయితే, భారత రాజకీయ చరిత్రలో ఒక పార్టీ తన పేరును పూర్తిగా మార్చుకున్న సందర్భాలు చాలా అరుదు. సాధారణంగా పార్టీలు చీలి కొత్త గ్రూపులుగా ఏర్పడతాయి తప్ప, మాతృ పార్టీ పేరు మారడం అనేది కొత్త అంశం కావడం వల్ల, పాత టైటిల్ విషయంలో ఈసీ గైడ్‌లైన్స్‌పై స్పష్టత లేదని నిపుణులు అంటున్నారు.తెలంగాణ మ్యాప్ స్థానంలో ఇండియా మ్యాప్ వచ్చి చేరినప్పటికీ, గులాబీ జెండా, కారు గుర్తు అలాగే కొనసాగుతున్నాయి.

 

అయితే, టీఆర్ఎస్ పేరుపై కేటీఆర్ స్పందించడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న “టీఆర్ఎస్” పేరును మరెవరూ తన్నుకుపోకుండా చూడటం, అవసరమైతే ఆ పేరుపై తమకున్న హక్కును కాపాడుకోవడం బీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.ఒకవైపు పాత పేరుతో ప్రజల్లోకి వెళ్తామని కొందరు సంకేతాలు ఇస్తుండటం, మరోవైపు టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ అప్రమత్తం అవ్వడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో “టీఆర్ఎస్” టైటిల్ చుట్టూ పెద్ద రాజకీయ యుద్ధమే జరిగేలా కనిపిస్తోంది. పాత టైటిల్ ఎవరి సొంతం అవుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.