Medchal: బీజేపీ ఆఫీసుకు ఎందుకెళ్లారో చెప్పిన మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి!

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం! మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నేత మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి అడుగులు ఎటువైపు? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ప్రత్యక్షమవ్వడం వెనుక ఉన్న అసలు మర్మమేంటి? గులాబీ గూటిలో ఉంటూనే కమలం నేతలతో భేటీ అవ్వడం వెనుక భారీ స్కెచ్ ఉందా? ఈ ఊహాగానాలన్నింటికీ స్వయంగా ప్రీతి రెడ్డి ఇచ్చిన క్లారిటీ ఏంటి? విద్యాసంస్థల్లో జరిగే ఆవిష్కరణల్లో భాగమా? లేక రాజకీయ ఎత్తుగడా?

 

గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే డాక్టర్ ప్రీతి రెడ్డి అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలతో ఆమె భేటీ అవ్వడం, సీనియర్ నేతలను కలవడం చూస్తుంటే.. కండువా మార్చడం ఖాయమని అందరూ భావించారు. కానీ, ఆమె బయటకు వచ్చి చెప్పిన మాటలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి.

ప్రీతి రెడ్డి వాదన ప్రకారం.. ఆమె పర్యటన రాజకీయాల కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్థాపించబోతున్న ప్రతిష్టాత్మక ‘ఏఐ డిజిటల్ యూనివర్సిటీ’ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆమె ఆహ్వానించారు. దేశంలోనే అతిపెద్ద ఏఐ క్యాంపస్‌గా అవతరించబోతున్న ఈ ప్రాజెక్టును ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని ఆమె చెప్పుకొచ్చారు.గూగుల్ సహకారంతో 50వేల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇచ్చే అతిపెద్ద కొలాబరేషన్ ఇది. ప్రధానిని పిలిచినప్పుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను, కేంద్ర మంత్రులను కలవడం ప్రొటోకాల్‌ అని ఆమె సమర్థించుకున్నారు.

రాజకీయ రంగు పులమడంపై ప్రీతి రెడ్డి ఘాటుగానే స్పందించారు. ‘నేను కేవలం బీజేపీ ఆఫీసుకే కాదు.. రేపు గాంధీ భవన్‌కు కూడా వెళ్తాను’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. విద్యను ప్రమోట్ చేసేందుకు పార్టీలతో సంబంధం లేదని, తెలంగాణ సిటిజన్‌గా, ఒక డాక్టర్‌గా అందరినీ ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. మోదీని కలిసింది టికెట్ కోసమో, పార్టీ చేరిక కోసమో కాదని.. ఢిల్లీకి వెళ్లింది కేవలం విద్యార్థుల కోసం మాత్రమేనని నొక్కి చెప్పారు.

 

చర్చ పార్టీ మార్పుపైకి వచ్చినప్పుడు.. ‘మేము బిఆర్ఎస్‌లోనే ఉన్నాం, ఇకపై కూడా ఉంటాం’ అని ప్రీతి రెడ్డి బాంబు పేల్చారు. అటు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందిస్తూ, మహిళలకు 33 శాతం సీట్లు ఉండాలని, ఇంటిని చక్కదిద్దే మహిళలు దేశాన్ని కూడా అద్భుతంగా నడిపిస్తారని తన పొలిటికల్ మెచ్యూరిటీని చాటుకున్నారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగా, ఇప్పుడే పార్టీ మార్పు చర్చలు ఎందుకు అంటూ మీడియాను ప్రశ్నించారు.

యాంకర్‌ వాయిస్‌: ప్రస్తుతానికి అయితే ప్రీతి రెడ్డి తన మాటలతో ఊహాగానాలకు బ్రేక్ వేశారు. కానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ప్రధాని మోదీ మల్లారెడ్డి యూనివర్సిటీకి వస్తారా? వచ్చినప్పుడు వేదికపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మల్లారెడ్డి కుటుంబం తమ పొలిటికల్ రూట్‌ను మార్చుకోబోతోందా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా.. విద్యా రంగంలో ఏఐ విప్లవం కోసం ప్రీతి రెడ్డి వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారాయి.