AP Politics: గ్లాస్‌ చెంతకు గుడివాడ..? పవన్‌పై మాజీ మంత్రికి ఎందుకంత ప్రేమ? అమరావతిపై జగన్ ‘మావిగన్’ ఎఫెక్టేనా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా? నాడు అధికారం అండతో జనసేనాని పవన్ కళ్యాణ్ పై విమర్శల తూటాలు పేల్చిన నోరు.. నేడు అదే నాయకుడి క్షేమం కోరుతూ ప్రార్థిస్తోంది. జగన్ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉండి, పవన్ వ్యక్తిగత జీవితాన్ని సైతం వదలకుండా విమర్శించిన మాజీ మంత్రి వైఖరిలో ఒక్కసారిగా మార్పు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ‘ఫ్యాన్’ పార్టీ పవర్ పోయాక, ‘పవర్ స్టార్’ పవర్ ఏంటో అర్థమైందా? లేక వైసీపీ భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లి రూటు మారుస్తున్నారా? డిప్యూటీ సీఎం కాలుకి ముళ్లు తగిలిన ఆ మాజీ మంత్రి తట్టుకోలేకపోతున్నారా.? ఇటీవల పవన్ పై అంతులేని ప్రేమ ఒలకబోయడానికి కారణం ఏంటి? జగన్ తీసుకొచ్చిన మావిగన్ వ్యవహారాలతో వైసీపీకి భవిష్యత్తు లేదని పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా?

 

ఏపీ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా వైసీపి అధ్యక్షుడు జగన్ మావిగన్ ప్రతిపాదన తర్వాత కొందరు నేతలు పార్టీకి భవిష్యత్తు లేదన్న భావనకు వచ్చారు. ముందే సర్దుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. లేకపోతే పొలిటికల్ గా ఫ్యూచర్ ఉండదన్న ఆందోళన కనిపిస్తోంది. అప్పుడు దిగులు, విచారం, చింత బెంగతో బతకాల్సి ఉంటుందన్న భావనకు వచ్చారు.ఫ్యాన్ పార్టీని నమ్ముకుంటే రాజకీయ భ్యవిషత్తు గల్లంతు అవుతుందని భయపడుతున్నారట. అలాంటి వారు ముందుగానే మేల్కోవాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో ఇటీవల వినిపిస్తున్న టాక్‌. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఈ కోవలోకే వస్తారని విశాఖ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాలనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ సినిమాల్లో హీరో అయిన రాజకీయాల్లో జీరో అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా నోరు పారేసుకున్న గుడివాడ అమర్‌నాథ్ ఇప్పుడు పశ్చాత్తాప భావంలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

 

 

అప్పట్లో తప్పు చేశానేమో అన్న బాధను అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు వలసలు కప్ప దాటు వ్యవహారాలు సర్వసాధారణం అధికారం ఎప్పుడూ ఎవరికీ ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరు చెప్పలేరు.జగన్ పాలనలో మంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలస్ పంపిన స్క్రిప్ట్ కు గుడివాడ అమర్‌నాథ్ తన పైత్యాన్ని జోడించి పవన్ కళ్యాణ్ ను తూలనాడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. అప్పట్లో నోరు పారేసుకోకుండా ఉండి ఉంటే బాగుండేదేమోనని ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతుంది.

 

జనసేననిపై గతంలో చేసిన వ్యాఖ్యలపై అంతర్మధనం చెందుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్‌ను దూషించినట్టు గా మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.జనసేన అధినేతకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బంది ఎదురైనా గట్టిగానే గళం విప్పుతూన్నారు ఈ మాజీ మంత్రి ఇటీవల పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు శ్రేయోభిలాషులు కంగారుపడ్డారు. శస్త్ర చికిత్స విజయవంతమైన తర్వాత కోలుకుంటున్నారన్న ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

గెట్ వెల్ సూన్ త్వరగా కోలుకోవాలంటూ అందరూ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే వైసీపి మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఫేస్‌బుక్‌ లో పోస్టులు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అమర్‌నాథ్ పెట్టిన పోస్టుల వ్యవహారం విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ అనాలోచిత నిర్ణయాలతో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఈ మాజీ మంత్రి భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అమరావతికి వ్యతిరేకంగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ వ్యవహారం బెడిసికొట్టింది. ముందుగా అమరావతికి సై అని చెప్పి ఆ తర్వాత నై అంటూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ అంశంలో జగన్ సాధించింది శూన్యం. మూడు రాజధానుల అంశమే గత ఎన్నికల్లో వైసీపి కొంప ముంచిందన్న విషయం పార్టీ నేతలందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను జనం నమ్మడం లేదని గుడివాడ తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి నిర్ణయాలు జగన్ తీసుకుంటే ఫ్యూచర్ లో ఫ్యాన్ పార్టీకి మనుగడ కష్టమని అందుకే గుడివాడ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన వేసుకుంటున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. గుడివాడ అమర్‌నాథ్ పార్టీలు మారడం కొత్త కాదు గతంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం రాజకీయ రక్షణ ఆశ్రయం సహకారం అవసరమని భావిస్తున్నారని వినిపిస్తోంది. అయితే, ఈ ప్రచారాన్ని అమర్‌నాథ్ అనుచరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన జగన్ వీరాభిమాని అని, పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతున్నారు. పవన్ కోలుకోవాలని ఆకాంక్షించడం కేవలం మానవతా దృక్పథమే తప్ప, ఇందులో రాజకీయం లేదని వారు సమర్థించుకుంటున్నారు.

రాజకీయాల్లో ఏదీ ఉచితంగా జరగదు, ఏ మాట వెనుకైనా ఒక అర్థం ఉంటుంది. నాడు విమర్శలు గుప్పించిన నోరే నేడు ప్రార్థనలు చేస్తోందంటే, అది నిజమైన పశ్చాత్తాపమా లేక మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమా అనేది కాలమే నిర్ణయించాలి. పవన్ కళ్యాణ్ అస్వస్థతను సాకుగా తీసుకుని ‘మాజీ’ మంత్రి వేస్తున్న ఈ అడుగులు ఆయనను ‘జనసేన’ తీరానికి చేరుస్తాయా? లేక వైసీపీలోనే ఉండి పోరాడతారా? వేచి చూడాలి.