TDP: టీడీపీ కమిటీలపై సీనియర్ల అసహనం.. కూటమి కోటలో ముదురుతున్న సెగలు!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్టీఆర్ కాలం నుండి పెట్టని కోటగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు రాజకీయ సెగలు రేగుతున్నాయి. తాజాగా ప్రకటించిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి, తీవ్ర అసంతృప్తికి వేదికగా మారాయి. కష్టకాలంలో పార్టీ జెండా మోశాం.. వైసీపీ అరాచకాలను భరిస్తూ కేసులు పెట్టించుకున్నాం.. కానీ పదవుల పంపకంలో మాత్రం మాకు దక్కింది శూన్యం అంటూ సీనియర్ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

కూటమి పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసిన నేతలకు, అధినాయకత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయా? ముఖ్యంగా జనసేన ప్రభావం పెరుగుతున్న తరుణంలో, టీడీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు పశ్చిమ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

రాష్ట్ర కమిటీల ప్రకటన కొందరు నేతలకు మోదం మరికొందరికి ఖేదంగా మారింది. కాపులకు జనసేన (Janasena)ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో టిడిపిలో(TDP) ప్రాముఖ్యత తగ్గిందా? తమ గుండెల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నాయి. కూటమి పార్టీల పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినప్పుడు అధినాయకత్వం చేసిన భాషలని మర్చిపోయిందట. అలాంటి నేతలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందా అటు నామినేటెడ్ పోస్టులు రాక ఇటు పార్టీ పదవులు దక్కక ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న నేతలని సంతృప్తి పరచడం టిడిపి హై కమాండ్ కు కష్టంగా మారిందట.

 

 

తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీల ప్రకటన కొందరు నేతల్లో సంతోషం నింపితే మరి కొందరిలో అసంతృప్తికి కారణమైంది. మంచి పదవులు దక్కిన వారు ఆనందిస్తుంటే ఇచ్చిన పోస్టు నచ్చలేదని పెదవి విరుస్తున్న వారు లేకపోలేదు. ఏ పదవి దక్కని వారు వ్యక్తం చేస్తున్న ఆగ్రహావేశాలను చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేన, బిజెపీ కోసం సీట్లు త్యాగం చేసినప్పుడు అలిగిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అప్పట్లో పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చి బుజ్జగించింది. కానీ ఆ తర్వాత దీనిని విస్మరించిందన్న విమర్శలు వచ్చాయి. తీరా ఇప్పుడు టిడిపి రాష్ట్ర కమిటీలో మంచి పదవి ఇవ్వలేదంటూ కొందరు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది.

 

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు ఉన్నా కొందరు వెలుగులోకి రాకుండానే కనుమరుగయ్యారు. మరికొందరు ఆస్తులు అమ్ముకొని ఇంకా పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండానే ఇక్కడ నాయకులు పార్టీ కోసం పని చేస్తున్న విషయం హై కమాండ్ కు తెలుసు. గతంలో ఎలా ఉన్నా 2024 ఎన్నికల తర్వాత మాత్రం పార్టీ విధి విధానాల్లో చాలానే తేడా వచ్చిందనేది నాయకుల మాట. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న సీనియర్లను కాదని జూనియర్లతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల కేటాయింపులో పెద్ద పీఠ వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రతిరోజు పత్రిక, ప్రసార మాధ్యమాల్లో కనిపించే వారికే ప్రాధాన్యత పెరిగిందనే వారు లేకపోలేదు. తెలుగుదేశం హై కమాండ్ టిడిపి జాతీయ రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఇది స్పష్టమైంది.

 

పార్టీ కమిటీల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల్లో కొందరికి మంచి పదవులే దక్కాయి. అలాంటి వారు సంతృప్తిగానే ఉంటే ఏ పోస్టులు రాని వారితో పాటు ఇచ్చిన పదవులు నచ్చలేదన్న వారిలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తమకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని కాపు సామాజిక వర్గ నేతలు పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కాపులకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో టిడిపిలో ఈ కమ్యూనిటీకి ప్రాముఖ్యత తగ్గిందనే మాట వినిపిస్తోంది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి పాపిరాజు టీడిపి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంచి వాగ్ధాటి ఉన్న ఈ నేతకు సరైన పదవే ఇచ్చారన్న అభిప్రాయంతో క్యాడర్ ఉంది.

 

రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాతకు (Pithala Sujatha) ఉపాధ్యక్ష పదవి ఇవ్వటంతో అనుచరులు ఆనందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ కు టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పదవిని ఇచ్చింది. కానీ ఇది నచ్చలేదు. ముందుగా రాష్ట్ర నీటిపారుదల సంస్థ డైరెక్టర్ గా నియమించిన చిన్న పోస్ట్ కావడంతో తీసుకోలేదు. ఇప్పుడు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇవ్వటంతో రామ్మోహన్ (Ram Mohan)అనుచరులు కొంత సంతృప్తిగానే ఉన్నారు.మరోవైపు గత ఎన్నికల్లో నరసాపురం(Narsapuram) టీడిపి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకి(Bandaru Madhava Naidu) ఏ పదవి ఇవ్వలేదని అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఈ సీటును జన సేనకు కేటాయించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

 

అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అది అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక భీమవరం టిడిపి నేత కోళ్ళ నాగేశ్వరరావుకు(kolla Nageshwara Rao) రాష్ట్ర కమిటీలో కార్యదర్శి పదవి ఇచ్చిన ఇది ప్రాధాన్యత లేని పోస్టు అన్న అసంతృప్తి ఉంది. లోకేష్(Nara Lokesh) పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేసిన ఈ నేతపై వైసీపి(YCP) ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాన్ని అనుచరులు గుర్తు చేస్తున్నారు. టిడిపి జిల్లా సమన్వయకర్త ఎన్నికల పరిశీలకుడు వంటి పదవులు నిర్వహించిన కోళ్ళ నాగేశ్వరరావు డిసిసిబి చైర్మన్ తో పాటు భీమవరం తెలుగుదేశం ఇన్‌ చార్జీ పదవి ఆశించారు. కానీ చివరికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ అధినాయకత్వం చేతులు దులుపుకుందని ఈ నేత అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.టీడిపి రాష్ట్ర కమిటీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపులకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. త్వరలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాపుల్లోనే అసంతృప్తి ఎలక్షన్లలో ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొన్న ఈ అసంతృప్తి కేవలం వ్యక్తిగత అలకలకే పరిమితం కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. పశ్చిమలో పట్టు కోల్పోతే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటుందని హైకమాండ్ గుర్తించాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనైనా సామాజిక సమీకరణాలను, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఈ సెగను చల్లారుస్తారా? లేక అధికారం వచ్చింది కదా.. ఎవరికి ఇచ్చినా నడుస్తుంది అనే ధోరణితో ముందడుగు వేస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, పశ్చిమ గోదావరి టీడీపీ నేతల సమస్యలను చంద్రబాబు, లోకేష్ ఎంత త్వరగా అడ్రస్ చేస్తే పార్టీకి అంత క్షేమకరం.