బొత్స కుటుంబానికి ఉత్తరాంధ్రలో రాజకీయ ప్రభావం బలంగా ఉంది. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కూతురు బొత్స అనూష గత కొద్దిరోజులుగా చీపురుపల్లి నియోజకవర్గంలో క్రీయశీలకంగా ఉన్నారు. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంలో చురుగ్గా ఉన్నారు. ఆమె రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది.
గరివిడి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం నుంచి ఆమె నిత్యం కార్యకర్తలతో టచ్‌లో ఉంటున్నారు.ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే మరోవైపు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇటీవల మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ సక్సెస్ చేసి పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించారు.

అంతేకాదు మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా నిలచింది. కేక్ కటింగ్, కార్యకర్తలతో కలిసి చేసిన జన్మదిన సంబరాలు గ్రాండ్ లుక్‌ను తీసుకొచ్చాయని పలువురు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత జరిగిన పార్టీ సమావేశాలకు తండ్రితోపాటు ఆమె పాల్గొంటున్నారు. దీంతో చీపురపల్లి నియోజకవర్గ బాధ్యతలను ఆమె చూసుకుంటున్నారనే ప్రచారం జరిగింది.

ఇటీవల రాష్ట్రస్థాయిలో కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో బొత్స సత్యనారాయణ బీజీగా ఉంటున్నారు. ఈక్రమంలోనే కార్యకర్తలకు కూతరు అనూష అందుబాటులో ఉంటారని సందేశాన్ని కార్యకర్తలకు అందించారు. దీంతో ఆమె ‘మన కార్యకర్త- మన కుటుంబం‘ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలను గుర్తిస్తూ మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతానికి తండ్రి బాధ్యతలను చీపురుపల్లి నియోజకవర్గంలో కూతురు అనూష చూస్తు్ందనే సంకేతాలు బొత్స సత్యనారాయణ ప్రత్యక్షంగానే కార్యకర్తలకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె గ్రౌండ్ లెవల్లోయాక్టివ్గా ఉంటూ జనంతో కలిసి తిరగడం, కూటమి వైపల్యాలను ఎండగట్టే తీరు చూస్తుంటే చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలు దాదాపుగా ఖరారు అయిందని సమాచారం. చీపురుపల్లి నియోజకవర్గ సమావేశంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ..తాను భీమిలి నియోజకవర్గానికి బాధ్యతలను పార్టీ అప్పగించిందని చీపురుపల్లి అనూష చూస్తారని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో అనూష రాజకీయ అడుగులకు లైన్ క్లియర్ అయిందని చెప్పడానికి ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి..?
మరోవైపు తల్లి బొత్స ఝూన్సీ బాటలో తనయరాలు నడవాలనే సెంటిమెంట్ కొనసాగించాలనే ఆలోచనలో సైతం ఆమె ఉన్నారని భావిస్తున్నారు. అదే జరిగితే గుర్ల లేదా గరివిడి మండలాల నుంచి జడ్పిటీసీగా పోటీ చేయనున్నారు. తల్లితోపాటు మేనమామ కొనసాగించిన జడ్పీ పీఠాన్ని మళ్లీ తమ కుటుంబ ఖాతాలోనే వేసుకోవాలనే వ్యూహాంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సమన్వయం చేయడంలోనూ సక్సెస్ అయ్యారు.
