జనసేనలో బాలినేని కౌంట్‌డౌన్ మొదలైందా? దామచర్లతో వైరం.. పవన్‌తో గ్యాప్!

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో అంద‌రి కంటే ఎక్కువ గౌర‌వ మ‌ర్యాద‌లు ద‌క్కించుకున్న నాయ‌కుడెవ‌రైనా ఉన్నారంటే… బాలినేని త‌ర్వాతే ఎవ‌రైనా అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో బాలినేని ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా సాగింది. అయితే ఆయ‌న మ‌న‌సుకు న‌చ్చంది చిన్న విష‌య‌మైనా బాలినేని ఓర్చుకోలేరు. మొద‌టి నుంచి బాలినేని మ‌న‌స్త‌త్వం ఇదే అని ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన వాళ్లు చెబుతున్నారు.

అందుకే త‌న‌తో ఎక్కువ మాట్లాడ‌నివ్వొద్ద‌ని వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానాన్ని గతంలో ఆయన బెదిరించేవారని టాక్. బాలినేని మ‌న‌స్త‌త్వం గురించి వైఎస్‌ఆర్‌సీపీ నేత‌లు ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ నేతృత్వంలో ఎప్పుడైనా ఎమ్మెల్యేలంద‌రితో స‌మావేశం నిర్వ‌హించేవారు. ఆ స‌మావేశంలో బాలినేని ఉద్దేశ‌పూర్వ‌కంగానే జ‌గ‌న్‌కు క‌నిపించ‌కుండా దూరంగా వుండేవార‌ట‌. బాలినేని కోసం జ‌గ‌న్ చూసి, క‌నిపించ‌క‌పోతే…వాస‌న్నా, వాస‌న్నా అని ఆరా తీసేవార‌ట‌. సీఎంగారు మిమ్మ‌ల్ని పిలుస్తున్నార‌ని ఒక‌రికి ప‌ది మంది బాలినేనికి చెప్ప‌డం, ఆయ‌న జ‌గ‌న్ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం జ‌రిగేద‌ని అంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలంద‌రికీ త‌న ప‌లుకుబ‌డి తెలియాల‌నే ఉద్దేశంతో బాలినేని త‌ర‌చూ అలా వ్య‌వ‌హ‌రించే వార‌ని వైఎస్‌ఆర్‌సీపీ ప్ర‌జాప్ర‌తినిధులు క‌థ‌లుక‌థ‌లుగా చెప్పేవారు.

బాలినేని బంధువు కావ‌డంతో జ‌గ‌న్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవార‌ని వైఎస్‌ఆర్‌సీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు బాలినేని వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బయటకు వెళ్లిపోయి తనకు తనే చేటు చేసుకున్నారని ఆయన అనుచరులు కూడా విమ‌ర్శలు చేస్తున్నారు. జ‌గ‌న్‌లా బాలినేనికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చే ప‌రిస్థితి లేదని బాలినేని సహచరులు కూడా ఫీలైపోతున్నారు. జ‌న‌సేన‌లో బాలినేని గుంపులో గోవింద అయిపోయాడని అంటున్నారు. అందుకే బాలినేని తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టున్నార‌ని చెబుతున్నారు. బాలినేని జ‌న‌సేన‌లో కూడా ఎక్కువ కాలం కొన‌సాగే ప‌రిస్థితి లేదని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందుకు ఉదాహరణ అంటున్నారు. బాలినేని మ‌న‌స్త‌త్వం తెలిసిన వారంతా చెబుతున్న మాట‌ ఒక్కటే.. జ‌న‌సేన‌ నుంచి బాలినేని ఎప్పుడు లోగా బయటకు వస్తారో అన్నది.
దీనికి తగ్గట్లే ఇటీవల పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. జ‌న‌సేన‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొద‌లైంది. ఒంగోలులో టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌తో బాలినేనికి మ‌రోసారి గొడ‌వ మొద‌లైంది.

 

ఒంగోలులో బాలినేని, దామ‌చ‌ర్ల మ‌ధ్య సుదీర్ఘ కాలంగా రాజ‌కీయ వైరం కొన‌సాగుతోంది. గ‌త ఎన్నికల్లో జ‌నార్ద‌న్ చేతిలో బాలినేని ఓడిపోయారు. ఆ త‌ర్వాత మౌనంగా వైసీపీలోనే వుండి వుంటే గౌర‌వం ద‌క్కేది.కానీ అధికారం లేని వైఎస్‌ఆర్‌సీపీలో బాలినేని ఉండ‌లేక‌పోయారు. అప్పుడ‌ప్పుడు త‌న గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు మంచి మాట‌లు మాట్లాడ్డాన్ని మ‌న‌సులో పెట్టుకుని, జ‌న‌సేన‌లో చేరితే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని బాలినేని ఆశించారు. దీంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతుల మీదుగా జ‌న‌సేన కండువా క‌ప్పుకున్నారు. పేరుకే కూట‌మి నాయ‌కుడు. ఒంగోలులో బాలినేనిని సొంత పార్టీ నాయ‌కులు కూడా ప‌ట్టించుకోని ప‌రిస్థితి. మ‌రోవైపు బాలినేని పేరు వింటే వైఎస్‌ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అస‌హ్యించుకునే ప‌రిస్థితి. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌కాశం జిల్లాలో అత్య‌ధికంగా ల‌బ్ధి పొందింది బాలినేని అని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని బావాబామ్మ‌ర్దులు. ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త విభేదాలు కాస్త‌, రాజ‌కీయంగా న‌ష్టం చేసుకునే వ‌ర‌కూ వెళ్లాయి. త‌న‌కు వైఎస్ జ‌గ‌న్ ఎంతో గౌర‌వం, విలువ ఇచ్చినా, వాటిని బాలినేని నిల‌బెట్టుకోలేద‌నే అభిప్రాయం వైఎస్‌ఆర్‌సీపీలో వుంది.

 

వైఎస్‌ఆర్‌సీపీలో వ‌ర్గ రాజ‌కీయాల్ని బాలినేని ప్రోత్స‌హించి, పార్టీకి తీవ్ర న‌ష్టం చేశార‌న్న విమ‌ర్శ కూడా లేక‌పోలేదు. మంచోచెడో బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డే వైఎస్‌ఆర్‌సీపీని వీడి వెళ్లార‌ని, మ‌ళ్లీ అత‌న్ని తీసుకోవ‌ద్ద‌నే అభిప్రాయం ఆ పార్టీలో వుంది. మ‌రోవైపు రెండుమూడు రోజులుగా ఒంగోలు ఎమ్మెల్యే, బాలినేని మ‌ధ్య డైలాగ్ వార్ జ‌రుగుతోంది. బాలినేని మీడియాతో మాట్లాడుతూ త‌న‌కు పార్టీ అండ లేక‌పోయినా, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు వుంద‌న్నారు. పార్టీ కంటే ప్ర‌జ‌లే ముఖ్య‌మ‌ని బాలినేని కీల‌క కామెంట్స్ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యేతో స‌ర్దుకెళ్లాల‌ని ప‌వ‌న్ ఆదేశిస్తార‌ని బాలినేనికి బాగా తెలుసు. అయితే అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి లేద‌ని బాలినేనికి తెలుసు. ఇక‌పై వారంలో రెండుమూడు రోజులు ఒంగోలులోనే వుంటాన‌ని, నీ క‌థేంటో చూస్తాన‌ని బాలినేని ఎమ్మెల్యేని హెచ్చ‌రించారు.

 

ఇదే జ‌రిగితే, జ‌న‌సేన నుంచి వెళ్లిపోవ‌డం త‌ప్ప‌, మ‌రో మార్గం బాలినేనికి లేదు. జ‌న‌సేన‌లోనే కొన‌సాగాలంటే ఎమ్మెల్యే జ‌నార్ద‌న్‌కు లొంగిపోయి బ‌త‌కాలి. ఇది జ‌రిగే ప‌నికాదు. అందుకే ఏ క్ష‌ణ‌మైనా జ‌న‌సేన‌ను వీడాల్సిన ప‌రిస్థితి బాలినేనికి ఎదురు కావ‌చ్చు. జ‌న‌సేన‌లో బాలినేనికి కౌంట్‌డౌన్ మొద‌లైంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఒక‌వేళ జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌ప‌డితే, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సానుకూల సంకేతాలు రాలేదు. దీంతో ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతోంది.