రాజకీయాల్లో ‘విలువలు’ మచ్చుకైనా కనిపించని ఈ రోజుల్లో.. ఒక మిత్రుడి కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టిన నాయకుడు, ఆ నమ్మకానికి సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి.. వీరిద్దరి అరుదైన అనుబంధమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. నాడు ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ‘ఓటుకు నోటు’ కేసులో ఇరుక్కుని రేవంత్ రెడ్డి జైలు పాలైతే, నేడు అదే నమ్మకస్తుడైన వేం నరేందర్ రెడ్డికి ఏకంగా రాజ్యసభ బెర్త్ ఖరారు చేయించి, పాతాళం నుంచి ఆకాశమంత ఎత్తుకు తన స్నేహాన్ని నిలబెట్టారు సీఎం రేవంత్. 16 మంది హేమాహేమీలు, సాక్షాత్తూ ప్రియాంక గాంధీ లాబీయింగ్‌ను సైతం పక్కన పెట్టి.. ‘నా నీడకు.. నా తోడుకు’ ఈ పదవి దక్కాల్సిందేనని రేవంత్ నెగ్గించుకున్న తీరు.. కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పుడు, జైలు గోడల మధ్య ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు.. రేవంత్ రెడ్డి వెనుక ధైర్యంగా నిలబడ్డ వ్యక్తే వేం నరేందర్ రెడ్డి. తన రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని తెలిసినా, చిక్కుల్లో పడతానని గ్రహించినా సరే.. స్నేహం కోసం అడుగు వెనక్కి వేయలేదు. నాడు రేవంత్ కోసం నరేందర్ రెడ్డి పడ్డ తపన, నేడు నరేందర్ రెడ్డి కోసం రేవంత్ చూపుతున్న కృతజ్ఞత.. తెలంగాణ రాజకీయాల్లో ఒక ఎమోషనల్ చాప్టర్.
తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్దిరోజులుగా సాగుతున్న రాజ్యసభ సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. హైకమాండ్ ఆశీస్సులతో ఒక సీటు అభిషేక్ సింఘ్వీకి రెన్యూవల్ కాగా.. అందరి దృష్టి ఉన్న రెండో సీటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన ఆత్మీయుడి ఖాతాలో వేయించుకున్నారు. హేమాహేమీల మధ్య సాగిన రేసులో సీఎం పొలిటికల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డిని అదృష్టం వరించింది.ఈ రెండో సీటు కోసం కాంగ్రెస్‌లో మామూలు పోటీ జరగలేదు. దాదాపు 16 మంది సీనియర్ నేతలు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఏకంగా ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతల ద్వారా పైరవీలు చేయించినా, అధిష్టానం మాత్రం ముఖ్యమంత్రి మాటకు కట్టుబడింది. రాష్ట్రస్థాయి నేతలు చేయని ప్రయత్నం అంటూ లేని ఈ తరుణంలో.. రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకోవడం ఆయన రాజకీయ బలానికి నిదర్శనం.
ఒక స్నేహితుడి కోసం తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టిన అరుదైన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ స్నేహమే వేం నరేందర్ రెడ్డి. వీరిద్దరి బంధం నేటిది కాదు.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే రేవంత్ వెన్నంటే నరేందర్ రెడ్డి ఉండేవారు. ఆ అనుబంధమే వీరిద్దరినీ ఒక చారిత్రాత్మక మలుపు తిప్పింది.2015లో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. తగినంత బలం లేకపోయినా, తన మిత్రుడిని చట్టసభకు పంపాలని రేవంత్ చేసిన ప్రయత్నమే ఆయనను చిక్కుల్లోకి నెట్టింది.నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం వెనుక ఉన్న ఏకైక కారణం.. నరేందర్ రెడ్డిపై ఉన్న అపారమైన అభిమానం.తన కోసం రేవంత్ రెడ్డి జైలు పాలు కావడం, రాజకీయ జీవితం ప్రమాదంలో పడటంతో వేం నరేందర్ రెడ్డి అనుభవించిన మనోవేదన అంతా ఇంతా కాదు.
నాడు రేవంత్ జైలుకు వెళ్తే.. నరేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ, ఆ కష్టకాలంలోనే వీరి బంధం మరింత బలపడింది. ఎదురుదెబ్బలు తగిలినా, కేసులు వెంటాడినా ఇద్దరూ ఒకరి చేయి ఒకరు వదల్లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, ఆపై ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో ప్రతి అడుగులోనూ నరేందర్ రెడ్డి ఒక ‘ఛాయ’లా ఉంటూ వ్యూహాలు రచించారు.నాడు ఎమ్మెల్సీ కోసం వెళ్తే జైలు ఎదురైంది.. నేడు అదే నమ్మకానికి ప్రతిఫలంగా దేశ అత్యున్నత సభ అయిన రాజ్యసభ తలుపులు తెరుచుకున్నాయి.
అధిష్టానం ఒత్తిళ్లు, హేమాహేమీల పైరవీలు, స్వయంగా ప్రియాంక గాంధీ సిఫార్సులు.. ఇన్ని అడ్డంకులను దాటుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అభిషేక్ సింఘ్వీకి ఒక సీటు ఖరారైన వేళ, రెండో సీటు కోసం సాగిన ‘ఢిల్లీ వార్’ లో రేవంత్ రెడ్డి తన చాకచక్యంతో వేం నరేందర్ రెడ్డికి బెర్త్ కన్ఫామ్ చేయించారు. ఈ పరిణామం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికింది.వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేవీపీ రామచందర్ రావు పోషించిన పాత్రనే ఇప్పుడు నరేందర్ రెడ్డి పోషించబోతున్నారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ప్రియాంక గాంధీ స్వయంగా ఒక వ్యక్తి కోసం ప్రయత్నించినా, రేవంత్ రెడ్డి తన సన్నిహితుడికే పట్టం కట్టించుకోవడం ద్వారా నరేందర్ రెడ్డికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో స్పష్టమైంది. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు పార్టీ మరియు ప్రభుత్వంలోని కీలక వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత ఇకపై పూర్తిస్థాయిలో నరేందర్ రెడ్డి చేతుల్లోకి వెళ్లనుంది.ఒకప్పుడు కేవీపీని కలిస్తే చాలు.. పని అయిపోయినట్లే అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో కూడా వేం నరేందర్ రెడ్డి రూపంలో అటువంటి పవర్ఫుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తయారైంది.
వైఎస్సార్‌కు కేవీపీ ఎలాగో.. రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలా! ‘వైఎస్ ఆత్మ’గా కేవీపీ పిలవబడితే, రేవంత్ ‘షాడో’గా నరేందర్ రెడ్డి గుర్తింపు పొందారు.నాడు వైఎస్సార్ వద్దకు వెళ్ళాలన్నా, పొలిటికల్ వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా కేవీపీయే మార్గం. ఇప్పుడు గాంధీ భవన్ నుంచి సెక్రటేరియట్ వరకు రేవంత్ మార్క్ రాజకీయాలన్నీ నరేందర్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.నాడు కేవీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ ట్రబుల్ షూటర్‌గా చక్రం తిప్పారు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
కాంగ్రెస్ అనేది కేవలం ప్రాంతీయ పార్టీ కాదు.. ఇక్కడ ప్రతి చిన్న నిర్ణయం వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉంటుంది. అందుకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత దూరదృష్టితో తన ‘నమ్మకస్తుడిని’ దేశ రాజధానిలో పాగా వేయించారు. కేవలం ఒక పదవి కోసమే కాదు.. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు, తన తరపున బలమైన గళం వినిపించేందుకు వేం నరేందర్ రెడ్డిని రేవంత్ ఒక అస్త్రంలా ప్రయోగించబోతున్నారు.జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యవహారాలు నిత్యం ఢిల్లీ చుట్టూనే తిరుగుతుంటాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడూ రాష్ట్ర పాలనపైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వెళ్లడం, హైకమాండ్‌తో సంప్రదింపులు జరపడం సాధ్యం కాదు.
అందుకే, తన ఆలోచనలను పసిగట్టగలిగే, తన కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి ఢిల్లీలో ఉంటే.. రాజకీయంగా తనకు ఎదురుండదని రేవంత్ భావించారు.
అందుకే అధిష్టానం వద్ద పట్టుబట్టి మరీ నరేందర్ రెడ్డికి రాజ్యసభ బెర్త్ ఖరారు చేయించారు. ఇకపై రేవంత్ రెడ్డి తరపున ఢిల్లీలో అన్ని వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత నరేందర్ రెడ్డిదే కానుంది.ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీలో పాత సంప్రదాయం మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. గతంలో వైఎస్సార్-కేవీపీ ద్వయం ఎలాగైతే అజేయంగా నిలిచిందో.. ఇప్పుడు తెలంగాణలో రేవంత్-నరేందర్ రెడ్డి జోడీ అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టించబోతోంది.
నాడు కేవీపీ ఎలాగైతే వైఎస్సార్‌కు కవచంలా ఉండి, అటు పార్టీని.. ఇటు ఢిల్లీ లాబీయింగ్‌ను మేనేజ్ చేశారో.. నేడు అదే పాత్రలో వేం నరేందర్ రెడ్డి కనిపించబోతున్నారు.ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్రంలో, రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో.. ఇలా రెండు చోట్లా ఆయన ‘పవర్ సెంటర్’గా మారనున్నారు.
రేవంత్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన పట్టును మరింత బిగించడమే కాకుండా, ఢిల్లీ స్థాయిలో ఆయన పరపతిని పెంచేందుకు దోహదపడనుంది.మొత్తానికి వేం నరేందర్ రెడ్డి ఎపిసోడ్ ద్వారా కాంగ్రెస్‌లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి నమ్మకం.. నరేందర్ రెడ్డి విధేయత.. కలిసి తెలంగాణ రాజకీయాల్లో ఏ స్థాయి మార్పులు తీసుకువస్తాయో వేచి చూడాలి.