YS JAGAN: అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు.. బయట జగన్ బాదుడు: సూటి ప్రశ్నలతో కూటమికి చెంపపెట్టు!

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా సమావేశం పెట్టారు. చాలా ప్రశాంతంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై లెక్కలతో మొదలు పెట్టి.. ఒక్కొక్కరినీ చండ్రాకోలుతో కొట్టినట్లు మాటలతో ఉతికిపారేశారు. కూట‌మి పాల‌న‌ను వైఎస్ జ‌గ‌న్ చీల్చి చెండాడారు.. కూట‌మి ప్రభుత్వ ప్రజా వ్య‌తిరేక విధానాల్లో ఏ ఒక్కటీ జగన్ వ‌దిలిపెట్ట‌లేదు. కూట‌మి ప్రభుత్వ విచ్చల‌విడి అప్పులు మొద‌లుకుని, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడి రాస‌లీల‌లు, అలాగే ప‌ర‌కామ‌ణిలో కోటి రూపాయిల విలువైన శ్రీ‌వారి ఆభ‌ర‌ణాలు చోరీ వ‌ర‌కూ జ‌గ‌న్ నిలదీశారు. అసలు కూటమి ప్రభుత్వం చెప్పేదానికి చేసే దానికి పొంతనలేదని.. అన్నీ లీకులు .. అవాస్తవాలే అని ఉతికి పారేశారు.

 

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు 16 రోజులు జ‌రిగినా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఉప‌యోగం లేద‌ని మాజీ సీఎం జ‌గ‌న్ అన్నారు. వైఎస్ఆర్ సీపీ హయాంలో చేసిన అప్పులు కేవ‌లం రూ.3.31 ల‌క్షల కోట్లగా జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం రూ.3.2 ల‌క్షల కోట్లు చేసిన‌ట్టు గణాంకాలతో సహా జ‌గ‌న్ వెల్లడించారు. ఇదే సమయంలో చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం పెట్టి.. అద్బుత.. అద్భుతః అంటూ భజన కార్యక్రమంలో పుల్ బిజీగా ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ హ‌యాంలో చేసిన అప్పుల్లో 96 శాతం ఈ రెండేళ్లలోనే ఎలా చేశారో జ‌గ‌న్ ఆర్బీఐ .. కాగ్ గణాంకాలతో వివరించారు. 2024-25లో ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి మించి ఏపీ సర్కార్ 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చార‌ని జ‌గ‌న్ తెలిపారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఎవ‌రు జాగ్రత్తగా నిర్వహించారు, అలాగే న‌ష్టప‌రిచారో ఈ గణాంకాలు చూస్తే ప్రజలకు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని జ‌గ‌న్ స్పష్టం చేశారు.. ప్రతి విష‌యంలోనూ చంద్ర‌బాబు స‌ర్కార్ దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ దుయ్య‌బ‌ట్టారు. త‌మ హ‌యాంలో కోవిడ్ మ‌హ‌మ్మారి పంజా విసిరినా, ఆదాయాలు త‌గ్గినా హామీలు నెర‌వేర్చామ‌న్నారు. కానీ చంద్ర‌బాబు పాల‌న‌లో అలా జ‌ర‌గ‌డం లేద‌ని విమ‌ర్శించారు. చంద్రబాబు, కూట‌మి నేత‌లు దోచి పెట్టడానికే స‌రిపోతోంద‌న్నారు. మ‌ట్టి, ఇసుక‌, భూములు, లిక్క‌ర్ దేన్నీ వ‌దిలిపెట్టలేద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ప్రతిదీ దోచుకుంటుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? ప్ర‌జ‌ల‌కు సంక్షేమం ఎలా అందుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ నిల‌దీశారు.

విశాఖలో అత్యంత విలువైన భూముల్ని త‌క్కువ ధ‌ర‌కే అయిన వారికి పప్పూ బెల్లాలులా క‌ట్టబెడుతున్నార‌ని జ‌గ‌న్ మండిపడ్డారు. అలాగే రూ.5 వేల కోట్ల విలువైన‌ 54 ఎక‌రాల ప్రభుత్వ భూముల్ని చంద్రబాబు బంధువు క‌బ్జా చేస్తున్నాడ‌ని జ‌గ‌న్‌ నిలదీశారు. ఇది బంధుప్రీతి కాదా అని విరుచుకుప‌డ్డారు. ఇంత బ‌హిరంగంగా ముఖ్యమంత్రి, ఆయ‌న బంధువైన లోక్‌స‌భ స‌భ్యుడు క‌లిసి ప్ర‌జ‌ల్ని దోచేస్తున్నార‌ని తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. ఈ విష‌యంలో ప్రభుత్వంతో పాటు వ్యవ‌స్థల‌న్నీ చోద్యం చేస్తున్నాయ‌ని జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసెంబ్లీ స‌మావేశాలు ఆత్మ స్తుతి, ప‌ర‌నింద‌గా సాగాయ‌ని ఇంతకంటే సిగ్గుచేటు వ్యవహారం ఇంకొకటి లేదన్నారు.

 

చంద్రబాబు త‌న కుమారుడికి జాకీలు పెట్టి ఎత్తితే, బాబుకి ఆయ‌న కొడుకు లోకేశ్ జాకీలు పెట్టి జనసేన మంత్రులు కూడా ఎత్తుతున్నార‌న్నారు. వీళ్లిద్ద‌రికీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రొక జాకీ పెట్టి లేపుతున్నట్టు వైఎస్ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. కూట‌మి ప్రభుత్వం మూడు బడ్జెట్‌లను ప్రవేశ పెట్టింద‌న్నారు. కానీ హామీల‌ను నెర‌వేర్చడంలో చేతులెత్తేసింద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్‌లు లేవ‌న్నారు. నెల‌కు మూడు వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్న హామీ ఏమైంద‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అలాగే ఆడ‌బిడ్డ నిధి కింద మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.1500, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.4 వేలు పింఛ‌న్ ఇస్తామ‌న్న హామీ ఏమైంద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఒక్క నెల‌లోనే 25 వేల పింఛ‌న్లు క‌ట్ చేశార‌ని జ‌గ‌న్ మండిపడ్డారు. దీనికోసం పెన్షన్ దారులకు ఇస్తున్న మొత్తాలు తగ్గటమే నిదర్శనమని తెలిపారు. త‌మ హ‌యాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు. పెన్షన్ల కోసం బ‌డ్జెట్‌లో రూ.31,554 కోట్లు పెట్టాల్సి వుంద‌న్నారు. కానీ రూ.27,719 కోట్లు మాత్ర‌మే పెట్టార‌న్నారు.

రానున్న రోజుల్లో భారీగా పెన్షన్లలో కోత విధించ‌నున్నార‌ని, బ‌డ్జెట్‌లో కేటాయించిన నిధులే నిద‌ర్శన‌మ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. రైతుల‌ను దారుణంగా మోస‌గిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రైతుల పంట‌ల‌కు క‌నీస గిట్టుబాటు ధ‌ర అంద‌డం లేద‌న్నారు. అలాగే అన్నదాత సుఖీభ‌వ పథ‌కం కింద‌… ప్రతి ఏడాది రూ.20 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చి, తుంగ‌లో తొక్కార‌ని విమ‌ర్శించారు. మొద‌టి ఏడాది మొత్తానికి మొత్తమే ఎగ్గొట్టార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. మంచి చ‌దువు, వైద్యం , ఉపాధి ఇవ్వకుండా ముగ్గురేసి పిల్లల్ని క‌నాల‌ని చంద్ర‌బాబు కోరుతున్నాడ‌ని త‌ప్పు ప‌ట్టారు. పెళ్లి చేసుకున్న ప్రతి జంట‌కూ చంద్రన్న పెళ్లి కానుక కింద రూ.ల‌క్ష ఇస్తాన‌ని ఎన్నిక‌ల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. పెళ్లి కానుక ఇచ్చే దిక్కు లేదు కానీ, మూడో సంతానం కంటే రూ.25 వేలు చొప్పున ప్రోత్సాహం ఇస్తాన‌ని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా వుంద‌న్నారు.

 

మ‌హిళ‌ల జోలికొస్తే తాట‌తీస్తాన‌ని చంద్ర‌బాబు సినిమా డైలాగ్‌లు చెబుతున్నాడ‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. రైల్వేకోడూరు జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ ఒక మ‌హిళ‌ను లైంగికంగా వేధించి, మోస‌గిస్తే ఏం చేశార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అలాగే కేజీబీవీ మ‌హిళా ప్రిన్సిపాల్‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డ టీడీపీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని నిల‌దీశారు. మ‌హిళ‌తో అస‌భ్యకర రీతిలో వీడియో కాల్‌లో మాట్లాడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే న‌సీర్ అహ్మ‌ద్‌పై ఏం చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. మంత్రి సంధ్యారాణి పీఏ వేధింపుల మాటేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాధితురాలిపైనే కేసు పెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీటీడీ చైర్మ‌న్ ఒక మ‌హిళ‌ను మోస‌గించి వీడియో, ఫొటోల‌తో అడ్డంగా దొరికినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని చంద్ర‌బాబును జ‌గ‌న్ ప్రశ్నించారు. దేవుడంటే భ‌య‌భ‌క్తులున్న వారినే టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించాల‌ని తెలిసి కూడా బీఆర్ నాయుడిని ఆ సీట్లో కూచోపెట్టార‌ని జ‌గ‌న్ త‌ప్పు ప‌ట్టారు.

 

తిరుమ‌ల‌కు స‌ర‌ఫ‌రా అయిన నెయ్యి వ్యవ‌హారంలో త‌మ పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానాలు చెప్పకుండా పారిపోయార‌న్నారు. ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ మ‌ధ్య సంబంధాల గురించి మండ‌లిలో ఎమ్మెల్సీలు నిల‌దీశార‌న్నారు. సంగం-వైష్ణ‌వి మ‌ధ్య సంబంధాల గురించి ప్రశ్నించినా నోరు మెద‌ప‌లేద‌న్నారు. తిరుమ‌ల హుండీ డ‌బ్బు లెక్కించే ప‌ర‌కామ‌ణి నుంచి ఏకంగా కోటి రూపాయిల విలువైన బంగారాన్ని చోరీ చేశార‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలోనే ఈ ఘోర త‌ప్పిదం జ‌రిగింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. దొంగ‌కు ద‌గ్గరుండి బెయిల్ ఇప్పించి, కేసును నీరుగార్చే ప్రయ‌త్నం చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. త‌మ హ‌యాంలో రూ.75 వేల విలువైన విదేశీ క‌రెన్సీ నోట్లు దొంగ‌త‌నానికి గురైతే, నిందితుడి నుంచి 15 కోట్ల విలువైన ఆస్తుల్ని టీటీడీకి రాయించామ‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. కానీ కోటి విలువైన శ్రీ‌వారి ఆభ‌ర‌ణాలు చోరీకి గురైతే కేసు బ‌య‌టికి రాకుండా గూడుపుఠాణీ చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే 2025లో త‌మ హ‌యాంలో భారీ దొంగ‌తనాన్ని, మ‌హాప‌చారాన్ని దాచి పెట్టేందుకు 2023 నాటి వ్యవ‌హారాన్ని తెర‌పైకి తెచ్చి దుష్ప్రచారం చేశార‌ని విమ‌ర్శించారు.

చంద్రబాబు పాల‌న‌లో పాలు తాగినా, నీళ్లు తాగినా చ‌నిపోతున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ ఆవేద‌న వ్యక్తం చేశారు. స్కూల్స్‌, హాస్టల్స్‌లో నాణ్య‌మైన ఆహారం పెట్టడం లేద‌న్నారు. క‌లుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇలా వైఎస్ జ‌గ‌న్ ఉద్యోగ‌, విద్యార్థి, రైతులు …అన్ని వ‌ర్గాల ప్రజ‌ల స‌మ‌స్యల్ని ప్రస్తావించి కూట‌మి స‌ర్కార్‌కు చాకిరేవు పెట్టారు. ఉద్యోగుల‌కు ఇంత వ‌ర‌కూ ఐఆర్‌, డీఏ, పీఆర్సీ త‌దిత‌ర విష‌యాల్లో జ‌రుగుతున్న అన్యాయాన్ని వారు ఎలా మోసపోయారో సోదాహరణంగా వివరించారు. మొత్తానికి అన్ని స‌మ‌స్యల్ని ప్రస్తావించి, కూట‌మి ప్రభుత్వాన్ని రాజ‌కీయంగా నడిబజారులో నిలబెట్టారు. జగన్ ప్రశ్నలు కూటమి నేతలు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే.. తమతో పవన్ కళ్యాణ్‌ ఉన్నాడని కాపుల ఓట్లు గుంపగుత్తగా తమకే పడతాయనే ఈక్వేషన్‌తో అడ్డగోలు దోపిడీకి తెరదీశారు. ఇవన్నీ.. కూటమికి చెంపెట్టు అని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి, ఇవన్నీ చంద్రబాబు విన్నారో.. లేదో.. కానీ ప్రజలు మాత్రం యూట్యూబ్‌లో బాగానే విన్నారు. ప్రజా న్యాయస్థానంలో ప్రతి ఒక్కరూ కూటమి బాధితులే అన్న జగన్ మాటలు బాగానే తగిలాయి. చూడాలి మరి.. ఇప్పటికైనా చంద్రబాబు అండ్ కో తప్పులను సరిచేసుకుని ముందుకు వెళ్తారో.. లేక గతంలో లాగే.. వ్యవహరించి మళ్లీ ప్రతిపక్షానికి వస్తారో చూడాలి.