టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్: లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చిన చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీలో కీలక మార్పు చోటుచేసుకుంది. యువనేత, మంత్రి నారా లోకేష్‌కు పార్టీలో అత్యున్నత పదవి దక్కింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వారసుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న నారా లోకేష్‌కు పార్టీలో ప్రమోషన్ లభించింది.

ఇప్పటి వరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన లోకేష్.. ఇకపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో చక్రం తిప్పనున్నారు.జాతీయ స్థాయిలో పార్టీ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు, అటు ప్రభుత్వం, ఇటు పార్టీ మధ్య సమన్వయకర్తగా లోకేష్ వ్యవహరించనున్నారు. ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారని భావించిన చంద్రబాబు.. ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ మరియు సంస్థాగత బలోపేతంలో భాగంగా లోకేష్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా నియమించారు. అంతేగాకుండా కార్యకర్తల సంక్షేమ నిధి పర్యవేక్షణ కూడా లోకేష్ అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు.

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపులో లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆయన చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడంలో మైలురాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా భవిష్యత్తు నాయకత్వానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.లోకేష్ నియామకంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. అటు అడ్మినిస్ట్రేషన్‌లో మంత్రిగా బిజీగా ఉంటూనే.. ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాలి.