ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇప్పుడు ఒక బిగ్ టర్నింగ్ కాబోతుంది.. ఈ ఏడాది తర్వాత ఏపీ రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోబోతోంది. జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ఉనికినే ప్రశ్నిస్తోంది. అయితే, ఈ గండం నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
ఒకప్పుడు జనాభా నియంత్రణలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపిన బాబు, ఇప్పుడు జనాభాను పెంచాలంటూ వింత వాదనను తెరపైకి తెచ్చారు. ఇది మిత్రధర్మం కోసం కేంద్రానికి ఇస్తున్న సంకేతమా? లేక రాబోయే ప్రమాదాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడనా? దక్షిణాది ముఖ్యమంత్రులు కేంద్రంపై పోరాటం చేయాలని ప్రకటిస్తుంటే, చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గళం విప్పిన డీలిమిటేషన్ అంశం పెను దుమారం రేపుతోంది. ఒకప్పుడు జనాభా నియంత్రణే దేశాభివృద్ధికి మార్గం” అని నినదించిన అదే బాబు.. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ పిలుపునివ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమా? లేక కేంద్రంలోని మిత్రపక్షం దగ్గర మార్కులు కొట్టేయడానికా?
2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా.. బాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారా? మిత్రధర్మం కోసం ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న మేధావులను సైతం తొలుస్తోంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు జనాభా నియంత్రణలో దేశానికే ఆదర్శంగా నిలిచారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రిస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచుకుంటూ పోయాయి. ఫలితంగా డీలిమిటేషన్ జరిగితే, జనాభా ప్రాతిపదికన ఉత్తరాదికి ఎంపీ సీట్లు పెరుగుతాయి, క్రమశిక్షణ పాటించిన దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి.
ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) లాంటి వారు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తుంటే.. చంద్రబాబు మాత్రం కేవలం పిల్లల్ని కనండి అనే సలహాతో సరిపెడుతున్నారు. ఇది నెగిటివ్ టాక్‌కు దారితీస్తోంది. జనాభా పెంచడం అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదు.. మరి బాబు ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా కేంద్రం దగ్గర తేల్చడం లేదు? కేవలం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నందున నోరు విప్పడం లేదా?
రాజకీయాల్లో మిత్రధర్మం ముఖ్యం.. కానీ అది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఉండకూడదు. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా లేదు, నిధుల కొరత వేధిస్తోంది. ఇలాంటి తరుణంలో డీలిమిటేషన్ వల్ల ఏపీ ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గితే, భవిష్యత్తులో మన గొంతు పార్లమెంట్‌లో వినిపించే నాథుడే ఉండరని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.చంద్రబాబు అనుసరిస్తున్న ఈ వైఖరి చూస్తుంటే.. ఆయన కేంద్ర పెద్దలను నొప్పించడం ఇష్టం లేకనే మౌనంగా ఉన్నారా..? అన్న అనుమానం కలుగుతోంది.
ఒకవైపు ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుంటే, దక్షిణాది అగ్రనేతగా బాబు ఎందుకు గట్టిగా నిలబడలేకపోతున్నారు? మిత్రధర్మం కోసం చేస్తున్న ఈ రాజీ.. ఏపీకి కోలుకోలేని దెబ్బ కాబోతోందా?కొందరు విశ్లేషకులు మాత్రం.. బాబు పరోక్షంగా కేంద్రానికి హెచ్చరికలు పంపిస్తున్నారని! కానీ గ్రౌండ్ లెవల్ లో కనిపిస్తున్నది మాత్రం వేరు. కేవలం ప్రకటనలకే పరిమితమైతే ప్రయోజనం ఏముంది? దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమైతేనే కేంద్రం దిగివస్తుందని చెప్పకొస్తున్నారు. కానీ బాబు ఆ దిశగా అడుగులు వేయడం లేదని మరోవైపు వస్తున్న రాజకీయ విమర్శలు.
పిల్లల్ని కనాలని చెప్పడం వల్ల జనాభా పెరగదు, కానీ రాజకీయంగా మైలేజ్ వస్తుందని బాబు భావిస్తున్నారా? లేక డీలిమిటేషన్ అంశం మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చారా? అంటే ఏది ఏమైనా, చంద్రబాబు వైఖరి ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తీరుతో నష్టపోతుంటే.. పోరాడాల్సింది పోయి, సర్దుకుపోవడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారం కోసం పాకులాడటం వేరు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం వేరు. చంద్రబాబు అనుభవం ఇప్పుడు ఏపీకి రక్షణ కవచంగా నిలబడాలి. కానీ ఆయన ప్రస్తుత వైఖరి చూస్తుంటే నెగిటివ్ సంకేతాలను పంపిస్తోంది. మిత్రధర్మం పేరుతో మౌనం పాటిస్తే.. రేపు చరిత్ర మనల్ని క్షమించదని రాజకీయవర్గాల మండిపడుతున్నాయి.నియోజకవర్గాల విభజన అనేది ఏపీ రాజకీయ ఉనికికి సంబంధించిన సమస్య. ఇక్కడ రాజీ పడితే, భవిష్యత్తు తరాలు ఢిల్లీకి బానిసలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీలిమిటేషన్ విషయంలో ఇప్పుడు మనం మౌనంగా ఉంటే, రేపటి రోజున పార్లమెంట్‌లో మన గొంతు మూగబోవడం ఖాయం. చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని మిత్రధర్మం కోసం కాకుండా, రాష్ట్ర ఆత్మగౌరవం కోసం ఉపయోగించాల్సిన సమయం ఇది. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ఢిల్లీకి తలవంచడానికి కాదు.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడటానికి! మరి బాబు తన పంథాను మార్చుకుంటారా? లేక చరిత్రలో ఒక అపరాధిగా మిగిలిపోతారా? వేచి చూడాల్సి ఉంది.