తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది.. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను తిరిగి గుర్తుచేస్తూ… తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. నిజంగా తెలంగాణ ప్రజలు ఉన్న పార్టీలతో విసిగిపోయారా..? కొత్త పార్టీ అవసరం ఉందని భావిస్తున్నారా..? కవిత నిర్ణయం వెనుక అంతర్యం ఏమిటి? తెలంగాణలో కొత్త పార్టీకి అసలు స్పేస్ ఉందా? కవిత రాకతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అసలు తెలంగాణకు ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీ అవసరమా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన కొత్త పార్టీల ఎక్కడున్నాయి..?
బీఆర్ఎస్గా మారిన తర్వాత టీఆర్ఎస్ అనే బ్రాండ్ వాల్యూ తగ్గుతోందనే ఆందోళన కేడర్‌లో ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు..ఓటమి ఇవ్వన్ని పార్టీ కార్యకర్తల్లో ఒకింత నిరాశ కలిగించిన అంశంగా చెప్పుకోవచ్చు. పార్టీ బలహీన పడటానికి, ఓటమికి కుటుంబ సభ్యులే కారణమంటూ కవిత సంచలన ఆరోపణల చేసి బయటకు వచ్చారు. తెలంగాణ జాగృతి పేరుతో గడిచిన కొద్ది కాలంగా యాక్టివ్‌గా జనంలో తిరిగారు. పార్టీ పెడుతున్నానని టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ ఉంటుందని కవిత ముందే హింట్ ఇచ్చారు. అన్నట్లుగానే కవిత తన పార్టీ పేరులో తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టడం ద్వారా పాత టీఆర్ఎస్ ఓటర్లను, ఉద్యమకారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లి బీఆర్ఎస్గా మారిన క్రమంలో, తెలంగాణ వాదాన్ని భుజాన ఎత్తుకునే వారు కరువయ్యారనే ఫీలింగ్ ప్రజల్లో ఉంది. దానిని క్యాష్ చేసుకోవడమే కవిత లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగాకుండా పార్టీ లోపల జరుగుతున్న అంతర్గత విభేదాలకు సంకేతమా? అన్న ప్రశ్నలు మరోవైపు తలెత్తుతున్నాయి.అవును బీఆర్ఎస్ కేడర్ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందా..? అంటే ఖచ్చితంగా కొంతమేరు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కవితతో రాజకీయ ప్రయాణం కొనసాగించిన నాయకులు ఇప్పటికే కవితతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఇది ఒక విధంగా మిగిలిన పార్టీల కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నిఖార్సైన తెలంగాణ వాదులు కవిత వైపు మొగ్గు చూపుతున్నారు. 10ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆగ్రహం ఉన్నారు. దీంతో ఉద్యమకారులు కవిత పార్టీకి అడుగులు వేసేందుకు సిద్దం అయ్యారు. ఇది కేసీఆర్ లేదా కేటీఆర్‌కు తీవ్ర నష్టం కల్గించబోతుందనేది అనేది మాత్రం స్పష్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేనతో వచ్చిన నష్టం ఏమైనా ఉందా అంటే..? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ సీఎం రేవంత్రడ్డికి గానీ వచ్చిన నష్టం లేదని పక్కాగా చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా అధికార పార్టీ లోపాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపడం..ఆందోళనలు, ధర్నాలు చేయడం సర్వ సాధారణం. ఇప్పుడు కవిత పెట్టిన కొత్త పార్టీ టీఆర్ఎస్ అదే తెలంగాణ రాష్ట్ర సేన కూడా అదే చేస్తుంది. అంటే బీఆర్ఎస్ చేసే ఆందోళనలో టీఆర్ఎస్ భాగస్వామ్యం అయి ప్రభుత్వంపై పోరాడుతుందా అంటే అసలు ఆ సాహసం కవిత చేయదు. ఇప్పుడు కవిత ముందు అధికార పార్టీపై పోరాటం కంటే కుటంబ సభ్యులే టార్గెట్‌గా పనిచేయబోతుందనేది అనేది మాత్రం పక్కా.దీంతో కవిత పార్టీతో కాంగ్రెస్ కంటే గులాబీ పార్టీకే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తున్న బీజేపీకి, కవిత పార్టీ ఓట్ల చీలిక ద్వారా అడ్డంకిగా మారవచ్చు. అయితే, హిందూత్వ ఓటు బ్యాంకుపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కవిత రాజకీయ స్టైల్ ముఖ్యంగా బీజేపీ అగ్ర నాయకుల అనుకరిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ చేసే యాక్టివిటి కార్యక్రమాల్లో కవిత కూడా అదే స్థాయిలో గ్రౌండ్ లెవల్లో హజరవుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు త్రిముఖ పోరుగా భారతీయ జనతాపార్టీకి మళ్లీ పరాభావం తప్పదా..? అంటే ఈ సారి కవిత రూపంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందా..? అంటే కవిత టీఆర్ఎస్, కేసీఆర్ బీఆర్ఎస్తో బీజేపీకే కలిసోచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడివరకు బీజేపీకి వచ్చిన నష్టమేమి లేదని స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో వైఎస్ షర్మిల YSRTP, కోదండ రాం TJS వంటి రాజకీయ పార్టీలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రాలేదు. బీఆర్ఎస్ బలహీనపడిందన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఆ ఖాళీని పూరించడానికి కవిత ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రజలు ఇప్పటికే ఉన్న బలమైన పార్టీలను వదిలి కొత్త పార్టీని నమ్ముతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.తెలంగాణ సమాజం ఇప్పుడు అభివృద్ధి మరియు సుపరిపాలనపై దృష్టి పెట్టింది.రాజకీయ పార్టీల సంఖ్య పెరగడం ప్రజాస్వామ్యానికి మంచిదే కావొచ్చు, కానీ అది కేవలం కుటుంబ కలహాల వల్లనో లేదా వ్యక్తిగత అస్తిత్వం కోసం ఏర్పడితే ప్రజలు ఆదరించడం కష్టం.తెలంగాణకు ఇప్పుడు కొత్త పార్టీ అవసరం ఉందా అంటే.. ప్రజల్లో మార్పు కోరుకునే వర్గం ఎప్పుడూ ఉంటుంది. కానీ, అది కేవలం తెలంగాణ సెంటిమెంట్ మీద మాత్రమే నడవదు. బలమైన ఎజెండా, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ఉండాలి.
మొత్తానికి కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతోంది. ఇది కేసీఆర్ ఆశీస్సులతో జరిగిందా? లేక తిరుగుబాటా? అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, తెలంగాణ రాష్ట్ర సేన రాకతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.వచ్చే ఎన్నికల నాటికి ఈ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.